“వీరభోగ వసంత రాయులు” చిత్రంతో ఒక్కసారిగా అటు ప్రేక్షకులు మరియు విశ్లేషకుల దృష్టిలో నెగిటివ్ అయిపోయిన శ్రీవిష్ణు నటించగా విడుదలైన తాజా చిత్రం “బ్రోచేవారెవరురా”. “మెంటల్ మదిలో” అనంతరం దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన రెండో చిత్రమిది. సత్యదేవ్ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం నేడు (జూన్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: చదువు మీద ఆసక్తి లేక, జీవితంలో పెద్దగా గోల్స్ లేక, కాలేజ్ లో లెక్చరర్లు, ఇంట్లో తల్లిదండ్రుల చేత తిట్లు తింటూ లైఫ్ ను ఎంజాయ్ చేసే ముగ్గురు స్నేహితులు రాహుల్ (శ్రీవిష్ణు), రాకేష్ (శ్రీవిష్ణు), రాంబాబు అలియాస్ రాంబో (రాహుల్ రామకృష్ణ). ఈ మూడు కోతుల గుంపులోకి ఎంటర్ అవుతుంది మిత్ర (నివేదా థామస్). ప్రిన్సిపాల్ కూతురు అయినప్పటికీ ఆమెకి కూడా వీళ్లలాగే చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఈ నలుగురు కలిసి టైమ్ పాస్ చేస్తూ ఉంటారు.
కట్ చేస్తే.. మంచి చదువు ఉండి, ఉద్యోగావకాశాలు కూడా ఉండి సినిమా ఇండస్ట్రీ మీద ఫ్యాషన్ తో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వస్తాడు విశాల్ (సత్యదేవ్). కష్టపడి ప్రొడ్యూసర్ చేత ఒకే చేయించుకొని హీరోయిన్ క్యారెక్టర్ కోసం శాలిని (నివేదా పేతురాజ్)ను అప్రోచ్ అవుతాడు. ఈ ఇద్దరి నడుమ స్టోరీ డిస్కషన్స్ కాస్తా ప్రేమగా మారుతుంది.
ఈ రెండు విభిన్నమైన కథలు ఒకానొక పాయింట్ లో ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్షన్ కారణంగా ఆ కథల్లో వచ్చిన మార్పులేమీటీ? అనేది తెలియాలంటే అర్జెంట్ గా “బ్రోచేవారెవరురా” చిత్రాన్ని మీ దగ్గరలోని థియేటర్లో కచ్చితంగా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: సాధారణంగా సినిమాలో ఒకట్రెండు పాత్రలు మాత్రమే హైలైట్ అవుతుంటాయి. కానీ.. “బ్రోచేవారెవరురా” చిత్రంలో కథానాయకుడు శ్రీవిష్ణు, మిత్రులు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సెకండ్ మేల్ లీడ్ సత్యదేవ్, హీరోయిన్స్ నివేదా-నివేతా. ప్రిన్సిపాల్ గా శ్రీకాంత్, సి.ఐ గా హర్ష వర్ధన్, ఫ్రెండ్ రోల్స్ ప్లే చేసిన కౌశిక్ ఘంటసాల, రాజేష్ ఖన్నా, ప్రతినాయక పాత్ర పోషించిన అజయ్ ఘోష్, పిచ్చోడి పాత్ర పోషించిన బిత్తిరి సత్తి.. ఇలా చెప్పుకొంటుపోతే ఆఖరికి ట్యూషన్ టీచర్ క్యారెక్టర్ ప్లే చేసిన నటుడు వరకూ ప్రతి ఒక్కరికీ కథలో-కథనంలో ప్రాధాన్యత లభించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. బహుశా “రంగస్థలం” తర్వాత తెలుగులో ఆస్థాయిలో ప్రతి పాత్రకు సమానమైన ప్రాధాన్యత లభించిన చిత్రం “బ్రోచేవారెవరురా” అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.
ప్రతి ఒక్క నటుడు సినిమాకి ప్రాణమే. మరీ ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల కామెడీ వేరే లెవల్లో ఉంది. ఈమధ్యకాలంలో నేను మనస్ఫూర్తిగా నవ్వుతూ చూసిన సినిమా ఇదేనేమో.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు వివేక్ ఆత్రేయ తన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని టైటిల్ కార్డ్స్ మొదలుకొని ఎండ్ క్రెడిట్స్ వరకూ కట్టిపడేస్తే.. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ తన పాటలు మరియు నేపధ్య సంగీతంతో ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేశాడు. న్యూ ఏజ్ సినిమా అంటే ఇది అనిపించేలా ఉంది వారి పనితనం. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఫస్ట్ లుక్ పోస్టర్లో “చాలనమే చిత్రము.. చిత్రమే చలనము” అని ట్యాగ్ లైన్ తో రిలీజ్ చేసినప్పుడు ఏంటో ఇది కొత్తగా అనిపించింది కానీ.. కథ మొత్తం ట్యాగ్ లైన్ లోనే ఉందనే విషయం ఇంటర్వెల్ బ్లాక్ లో రివీల్ అయ్యేసరికి అతడి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేము. అలాగని మనోడేమో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు రాని కథను తయారు చేసుకోలేదు.. ఇదివరకూ చాలాసార్లు చూసిన కథనే, తనదైన టిపికల్ స్క్రీన్ ప్లేతో చాలా ఆసక్తికరంగా నడిపాడు. ఇలాంటి నవతరం దర్శకుల ప్రతిభ చూసినప్పుడే తెలుగు సినిమా భవిష్యత్ మంచి చేతుల్లో ఉంది అనే భావన కలుగుతుంటుంది. “మెంటల్ మదిలో” సినిమా విషయంలో కాస్త తడబడ్డాడు అనిపించుకొన్న వివేక్ ఆత్రేయ..
సెకండ్ సినిమాతో తనమీద ఉన్న ఆ చిన్న నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా మార్చేసుకొన్నాడు. నిజానికి ఈ స్క్రీన్ ప్లే చాలా టిపికల్ & కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. కానీ.. వివేక్ ఆత్రేయ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ కథనాన్ని నడిపిన విధానం ప్రశంసనీయం. చాలా కాలం తర్వాత సినిమా మొత్తంలో నెగిటివ్ పాయింట్స్ అనేవి ఏమీ కనిపించలేదు. ప్రతి సన్నివేశానికి లాజిక్ & సెన్స్ కుదిరాయి. దాంతో ఒక డిఫరెంట్ & ఎంటర్ టైనింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించింది “బ్రోచేవారెవరురా” చిత్రం. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్, టెక్నికల్ వెల్యూస్ అన్నీ బాగున్నాయి.
విశ్లేషణ: సాధారణంగా కామెడీ సినిమాల్లో లాజిక్ ఉండదు. కానీ.. లాజిక్, కామన్ సెన్స్, హ్యూమర్ & సెన్సిబిలిటీస్ సమపాళ్లలో కలిగిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ “బ్రోచేవారెవరురా”. రెండున్నర గంటల ఆరోగ్యకరమైన వినోదం కోసం కుటుంబ సభ్యులు/స్నేహితులతో కలిసి “బ్రోచేవారెవరురా” చిత్రాన్ని తప్పకుండా చూడండి.