అల్లు శిరేష్ (Allu Sirish) అనుకోకుండా చేసిన సినిమా “బడ్డీ” (Buddy). ఆర్య (Arya) హీరోగా తమిళంలో రూపొందిన “టెడ్డీ” సినిమాకు తెలుగు రీమేక్ రూపమే “బడ్డీ”. కాకపోతే.. కొద్దిపాటి మార్పులతో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కించి తెలుగులో విడుదల చేసారు. ఈ సినిమాకి పెద్దగా క్రేజ్ లేకపోయినా తక్కువ రేట్లతో కూడిన టికెట్లు మరియు పిల్లలు ఎంజాయ్ చేయగల కంటెంట్ అని అల్లు శిరీష్ చాలా నిజాయితీగా ప్రమోట్ చేసిన తీరు కొందరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరి “బడ్డీ” ఆ ప్రేక్షకుల్ని సినిమాగా అలరించగలిగిందో లేదో చూద్దాం..!!
కథ: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా వర్క్ చేసే పల్లవి (గాయత్రి భరద్వాజ్), ఒక సక్సెస్ ఫుల్ పైలట్ ఆదిత్య రామ్ (అల్లు శిరీష్)ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. అనుకోని విధంగా పల్లవి ఆత్మ ఒక టెడ్డీ బేర్ లోకి ప్రవేశిస్తుంది. అసలు పల్లవి ఆత్మలా ఎందుకు మారింది? టెడ్డీ బేర్ రూపంలో ఆదిత్యను ఎందుకు చేరుకుంది? ఆమె శరీరం ఎక్కడుంది? వంటి ప్రశ్నలకు సమాధానం “బడ్డీ” చిత్రం.
నటీనటుల పనితీరు: అల్లు శిరీష్ స్టైలిష్ లుక్స్ & కొద్దిపాటి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. యాక్షన్ బ్లాక్స్ వరకు మ్యానేజ్ చేశాడు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం ఎప్పట్లానే తేలిపోయాడు. గాయత్రి భరద్వాజ్ పెంకి పిల్లగా ఆకట్టుకుంది. ఆమెతోపాటు ప్రిషా కూడా సినిమాకి కావాల్సిన గ్లామర్ యాడ్ చేసారు. విలన్ గా అజ్మల్ (Ajmal Amir) రెగ్యులర్ యాక్టింగ్ తో బోర్ కొట్టించాడు. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: హిప్ హాప్ (Hiphop Tamizha) తమిళ పాటలు, నేపథ్య సంగీతం మరియు కృష్ణన్ వసంత్ (Krishnan Vasanth) సినిమాటోగ్రఫీ మాత్రమే సినిమాలో ఆకట్టుకునే అంశాలు. ప్రొడక్షన్ డిజైన్, గ్రాఫిక్స్ వర్క్ చాలా పేలవంగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళ వెర్షన్ గ్రాఫిక్స్ టెంప్లేట్స్ ను ఉన్నవి ఉన్నట్లుగా వాడేయడం గమనార్హం. అయితే.. సదరు తమిళ వెర్షన్ ను చూసినవాళ్లు తప్ప ఎవరూ గుర్తించలేరు, అది వేరే విషయం అనుకోండి. అయితే.. ఈ ఓటీటీ కాలంలో ఇలాంటివి చేయడం మానుకోవాలి. దర్శకుడు సామ్ ఆంటోనీ (Sam Anton) ప్రతిభ కానీ పనితనం కానీ ఎక్కడా కనిపించలేదు.
విశ్లేషణ: లాజిక్స్ అవసరం లేని సినిమాల్లో మ్యాజిక్ & కామెడీ ఉన్నా సరిపోతుంది. అది కూడా సరిగ్గా రాసుకోకపోతే “బడ్డీ”లా అవుతాయి సినిమాలు. మంచి బడ్జెట్ ఉంది, చక్కని నటీనటులు ఉన్నారు. సాంకేతికంగా కూడా మంచి సపోర్ట్ ఉంది. అయినా కూడా.. ఆడియన్స్ ఏం చూపించినా నమ్మేస్తారు అనే గుడ్డి నమ్మకంతో ఎమోషనల్ కనెక్టివిటీ లేకుండా సినిమాలు తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది అనేందుకు ఉదాహరణ “బడ్డీ”.