హాలీవుడ్ ఫిలిమ్ మేకింగ్ స్టైల్ భలే ఉంటుంది. దాదాపు ఏడాదిన్నరపాటు కేవలం ప్రీప్రొడక్షన్ మీద వర్క్ చేస్తారట. షూటింగ్ అనేది కేవలం ఆరేడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి బీబీసి చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “అవతార్” సృష్టికర్త జేమ్స్ కామరూన్ ను “సినిమా ఎంతవరకూ వచ్చింది?” అని ప్రశ్నించగా.. “అయిపోయింది” అని సమాధానమిచ్చాడట. అదేంటండీ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అని అడిగితే.. “ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, అంటే సినిమా దాదాపు పూర్తయినట్టే, షూటింగ్ మాత్రం పెండింగ్ ఉంది” అని చెప్పాడట. ప్రీప్రొడక్షన్ వర్క్ అనేది సినిమా మేకింగ్ లో ఎంతటి కీలకపాత్ర పోషిస్తుంది అనేందుకు ఈ సంఘటన ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
అయితే.. మన సౌత్ లో ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో మాత్రం కొందరు బడా దర్శకులతోపాటు, యంగ్ డైరెక్టర్స్ ఇప్పటికీ ఆన్ సెట్స్ స్క్రిప్ట్ రాసుకొంటుంటారు. అందువల్ల టైమ్ వేస్ట్ అవ్వడమొక్కటే కాదు చాలా సన్నివేశాలు ఎడిట్ సూట్ లోనే మాయమైపోతుంటాయి. ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటోంది “సాహో” బృందం. దర్శకుడు సుజీత్ దాదాపు స్క్రిప్ట్ మీద రెండేళ్లపాటు వర్క్ చేసినా.. సన్నివేశాల రూపకల్పనలో క్లారిటీ లేకపోవడంతో మొన్న దుబాయ్ లో దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి చిత్రీకరించిన ఓ సన్నివేశం నచ్చకపోవడమో లేక సందర్భానికి ఇమడకపోవడమో జరిగి.. ఆ సన్నివేశాన్ని ఎడిటింగ్ లో లేపేద్దామన్నాడట దర్శకుడు సుజీత్. దాంతో యూనిట్ మొత్తం షాక్ అయ్యిందట. అన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి తీసిన సన్నివేశాన్ని అంత సింపుల్ గా ఎలా తీసేస్తాడని, తీసేప్పుడు క్లారిటీ ఉంటే ఇలాంటి అనవసరమైన ఖర్చు ఉండదు కదా అని చర్చించుకొన్నారట.
తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవ్వనున్న “సాహో” సినిమా విషయంలో సుజీత్ ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తే.. అనుకొన్న బడ్జెట్ కంటే ఖర్చు డబుల్ అవుతుందని యువీ క్రియేషన్స్ సంస్థ సారధులు భయపడుతున్నారట.