Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!
- May 26, 2026 / 02:07 PM ISTByPhani Kumar
2 రోజుల క్రితం టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. దానికి కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.
Rathnavelu
ఆయన నటించిన ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా భోపాల్..లో(మధ్యప్రదేశ్) ఏర్పాటు చేసిన ఈవెంట్లో… బూమ్రాని ‘ఫుట్‌బాల్ ప్లేయర్’ అంటూ చరణ్ పొరపాటున సంబోధించాడు. దీంతో సోషల్ మీడియాలో చరణ్‌పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలైంది.
అయితే తన పొరపాటును వెంటనే గ్రహించిన రామ్ చరణ్, ట్విట్టర్ వేదికగా బుమ్రాకి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సర్దుమణిగింది.అయితే.. ఇప్పుడు బుమ్రా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కూడా ‘పెద్ది’ సినిమానే కారణం అని చెప్పాలి. జూన్ 4న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘పెద్ది’ కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన రత్నవేలు(Rathnavelu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఒక విలేకరి ఆయనను…. ‘టాలీవుడ్‌లో మీరు ‘ఖైదీ నెంబర్ 150’ ‘బ్రహ్మోత్సవం’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి ఎన్నో పెద్ద సినిమాలకు డీఓపీగా పనిచేశారు. కానీ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు వచ్చినంత గుర్తింపు, ప్రశంసలు మిగతా సినిమాలకు రాలేదు. రత్నవేలు టాలెంట్‌ను సుకుమార్ తప్ప వేరే దర్శకులు సరిగ్గా వాడుకోలేకపోతున్నారని అనుకోవచ్చా?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు రత్నవేలు.. “మీరు చెప్పింది నిజమే.!
టాలీవుడ్‌లో నేను సుకుమార్ ప్రాజెక్టులకు పనిచేసినప్పుడు నా వర్క్‌కి ఎక్కువ అప్రీషియేషన్ లభిస్తుంది. మిగతా సినిమాల్లో నా పనితనానికి అంతగా పేరు రావడం లేదు. అందుకు ఆ సినిమాల స్క్రిప్ట్..లే కారణం అని చెబుతాను. స్క్రిప్ట్ బలంగా ఉన్నప్పుడే నేను ఇచ్చే విజువల్ ఔట్‌పుట్ మరింత బాగా హైలైట్ అవుతుంది. స్క్రిప్ట్ సరిగ్గా లేకపోతే మనం ఏం చేసినా ఎలివేట్ కాదు. ఇక సుకుమార్ విషయానికి వస్తే.. ఆయన సినిమాల్లో నా విజువల్స్ బాగా కుదురుతాయి.
మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్, సింక్ చాలా బాగుంటుంది. క్రికెట్‌లో ‘ధోని – బుమ్రా’ కాంబో లాంటిదే మా కాంబో కూడా..!” అంటూ చెప్పుకొచ్చారు. అది మేటర్..!













