సంక్రాంతి ముందు వరకు టాలీవుడ్‌లో పైరసీ గురించి పెద్దగా చర్చ జరగలేదు. అంటే అప్పటివరకు పైరసీ లేదు అని కాదు కానీ.. సంక్రాంతికి ముందు వచ్చిన ఓ సినిమాకు జరిగిన తీవ్ర అన్యాయం తర్వాత పైరసీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఆ ఇబ్బంది పడిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాకు పైరసీ చేసి సంక్రాంతి సమయంలో బస్సుల్లో, లోకల్ టీవీల్లో వేశారు. ఆ సినిమా అంత ఇబ్బంది పడినా ఇండస్ట్రీ నుండి ఎవరూ ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు.
నిర్మాత కూడా ఓ చిన్న కంప్లైంట్ ఇచ్చారు. లోకల్ టీవీలో సినిమా టెలీకాస్ట్ చేసిన విషయంలో ఓ అరెస్టు కూడా జరిగింది. తాజాగా ఈ పైరసీ గురించి యువ నిర్మాత బన్ని వాస్ (Bunny Vasu) స్పందించారు. ఈ విషయంలో పరిశ్రమ, ప్రభుత్వాలు ఎలా స్పందించాలి అనే విషయంలో ఆయన కొన్ని ఆస్తక్తికర సూచనలు చేశారు. మరి ఆయన మాటల్ని ఎవరు సీరియస్‌గా తీసుకుంటారో చూడాలి.
సినిమాల పైరసీ విషయానికొస్తే.. ఒకప్పుడు థియేటర్ ప్రింట్లకు మాత్రమే పైరసీ వచ్చేఇది. అయితే ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఆ వీడియోలను కూడా పైరసీ చేస్తున్నారు. దీంతో ఇలా ఓటీటీలోకి సినిమా రావడం ఆలస్యం సినిమాను డౌన్‌లోడ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు అని బన్ని వాస్ గుర్తు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు సోషల్ మీడియాలో సినిమాల వీడియోలు, లైవ్‌లు ఇచ్చేవారని.. వాటిని ఆయా సంస్థలు కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగాయి అని ఆయన అంటున్నారు.
వాట్సాప్, టెలిగ్రామ్‌లో ఇప్పుడు సినిమాల లింక్‌లను సర్క్యులేట్ అవుతున్నాయని, వాటికి క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని ఆయన అంటున్నారు. వీటిని నియంత్రించాలంటే ఆ యాప్స్‌కు ప్రభుత్వం నుండి గైడ్ లైన్స్ వెళ్తే సమస్య తీరొచ్చు. దీనికి తగ్గట్టుగా పరిశ్రమ నుండి ప్రభుత్వానికి రిక్వెస్ట్‌లు వెళ్లాలి అనేది బన్ని వాస్ ఆలోచన. మరి ఆయన ఆలోచనకు టాలీవుడ్ నుండి ఎంతవరకు సపోర్టు చేస్తుంది, వాయిస్ రెయిజ్ చేస్తుంది అనేది చూడాలి.