Bunny Vas: బుక్‌ మై షో రేటింగ్‌లు.. ఎలా మోసం చేస్తున్నారో క్లియర్‌గా చెప్పిన బన్ని వాస్‌

సినిమాలు విడుదల కావడం ఎంత కామన్‌ అయిపోయిందో, వాటికి నెగిటివ్‌ టాక్‌లు, రివ్యూలు, రేటింగ్‌లు రావడం కూడా అంతే కామన్‌ అయిపోయాయి. సినిమా లీక్‌లను, పైరసీని ఆపడం ఎంత కష్టమో.. ఈ నెగిటివ్‌ రివ్యూ, నెగిటివ్‌ రేటింగ్‌లను కూడా ఆపడం అంత కష్టమైపోయింది అంటే అతిశయోక్తి కాదు. బాగోలేని సినిమాకు నెగిటివ్‌ రివ్యూలు ఇచ్చినా పెద్దగా ఇబ్బంది లేదు. అయితే బాగున్న సినిమాకు ఇలా తప్పుడు రివ్యూలు రేటింగ్‌లు ఇస్తే.. ఇబ్బందే అవుతుంది. ఇప్పుడు తమ సినిమా ఇలాంటి ఇబ్బందే పడుతోందని ‘ఈషా’ సినిమా టీమ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

Bunny Vas

కొందరు సినిమా చూడకుండానే సోషల్‌ మీడియాలో రివ్యూలిస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నిర్మాత వంశీ నందిపాటి మండిపడ్డారు. సీనియర్‌ నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌తో కలసి ఆయన నిర్మించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘ఈషా’ గురించి ఆయన ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడారు. మా సినిమా అమెరికాలో ఇంకా రిలీజ్ కాలేదు. కానీ అక్కడ ఉన్న ఒకరు నెగెటివ్‌ రివ్యూ ఇచ్చారు. అయినా ఇలా నెగిటివ్‌ రివ్యూలు ఇస్తే సినిమా చూడకుండా ఉండటానికి జనాలేమీ పిచ్చోళ్లు కారు అని వంశీ అన్నారు.

ఇక్కడివరకు ఓ లెక్క అయితే.. ఆ తర్వాత మరో నిర్మాత బన్ని వాస్‌ మాట్లాడుతూ బుక్‌ మై షోలో ఎలా ఫేక్‌ రేటింగ్‌లు వస్తున్నాయో క్లియర్‌గా లైన్‌ టు లైన్‌ చెప్పారు. ఒక సినిమా ప్రీమియర్స్‌ వేస్తే.. ఎవరో 200 టికెట్లు బుక్‌ చేస్తారు. ప్రీమియర్‌ అవగానే వారంతా 1 రేటింగ్‌ ఇస్తున్నారు. దీంతో బుక్‌మై షోలో రేటింగ్‌ పడిపోతుంది. మరుసటి రోజు ప్రేక్షకులు చూసి మళ్లీ రేటింగ్‌ ఇచ్చే వరకూ భయంగానే ఉంటుంది. ఎవరైనా మనల్ని దించాలనుకుంటే ఓ 300 టికెట్లకు రూ.50వేలు ఖర్చు పెట్టి ఇలా చేస్తారు అని బన్ని వాస్‌ తెలిపారు.

ఇక దామోదర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఓ 20 కంప్యూటర్లు పెట్టుకుని, ఇద్దరు మనుషులతో నెగెటివ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు అని చెప్పారు. అయితే ఇక్కడ ఒకటే ప్రశ్న.. ఇంత తెలిసి కూడా పరిశ్రమలో సీనియర్‌, అసోసియేషన్‌లో సభ్యుడు అయిన దామోదర్‌ ప్రసాద్‌ ఎందుకు చర్యలకు ముందుకు రానట్లు. ఇప్పటికైనా ఈ రివ్యూల పరిస్థితిపై పరిశ్రమ స్థాయిలో ఓ నిర్ణయం తీసుకోవాలి.

ఆ ఎక్స్‌ప్రెషనేంటి రాజ్‌.. సమంత 2025 రివ్యూలో ఆ ఫొటో చూశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus