బయట నుంచి చూసేవాళ్లకు సినిమా హీరోల జీవితం చాలా రంగులమయంగా కనిపిస్తుంది. ఒక సినిమాకు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకేంటి రాజా లాంటి బతుకు అని సామాన్యులు అనుకోవడం సహజం. పేపర్లలో వచ్చే భారీ ఫిగర్స్ చూసి కళ్లు తేలేస్తుంటారు. కానీ ఆ అంకెల వెనుక ఉన్న అసలు కష్టాలు, ఖర్చులు వేరేలా ఉంటాయని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
మనం వింటున్న రూ. 200 కోట్ల పారితోషికం అనేది నిజమే కావచ్చు, కానీ అది ఒక ఏడాది సంపాదన కాదు. ఈ రోజుల్లో ఒక పాన్ ఇండియా సినిమా పూర్తి కావడానికి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతోంది. అంటే ఆ మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తే, ఏడాదికి వచ్చేది 50 కోట్లు మాత్రమే. ఆ సమయంలో వారు వేరే సినిమాలు చేయడానికి కూడా ఉండదు. కాబట్టి బయట ప్రచారం జరుగుతున్నట్లుగా వాళ్ళ దగ్గర గుట్టల కొద్దీ డబ్బులు పోగుపడటం లేదని, టైమ్ పీరియడ్ ని బట్టి చూస్తే అది సాధారణమేనని వాసు లాజిక్ వివరించారు.
ఇక అసలైన తలనొప్పి ‘మెయింటెనెన్స్’ దగ్గరే ఉంది. హీరో అంటే స్క్రీన్ మీద గ్లామర్ గా కనిపించాలి, ఫిట్ గా ఉండాలి. దీనికోసం వాళ్ళు పెట్టే ఖర్చు సామాన్యులకు ఊహకందని రేంజ్ లో ఉంటుంది. టాప్ స్టార్స్ తమ లైఫ్ స్టైల్, స్టాఫ్, సెక్యూరిటీ కోసం నెలకు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అంటే ఏడాదికి సుమారు 25 కోట్లు కేవలం మెయింటెనెన్స్ రూపంలోనే కరిగిపోతోంది. ఒక మిడ్ రేంజ్ హీరోకి కూడా ఇది రూ. 6 నుంచి 10 కోట్ల వరకు ఉంటోందని ఆయన లెక్కలతో సహా చెప్పారు.
ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో హీరోలు అస్సలు రాజీ పడరు. బాడీని షేప్ లో ఉంచే పర్సనల్ ట్రైనర్ జీతమే నెలకు రూ. 15 నుంచి 16 లక్షల వరకు ఉంటోందట. ప్రభుత్వానికి పన్నులు కట్టగా మిగిలిన డబ్బులో నుంచే ఈ ఖర్చులన్నీ భరించాలి. ఇవన్నీ పోను చివరగా హీరో చేతిలో మిగిలేది, జనం అనుకుంటున్నంత భారీ మొత్తం కాదని అర్థమవుతోంది. ఆ గ్లామర్ వెనుక ఇంత పెద్ద ఆర్థిక భారం, ఒత్తిడి ఉంటుందని సామాన్యులకు తెలియదు.
చివరగా సినిమా హిట్ అయితే అందరూ హ్యాపీ, కానీ ఫ్లాప్ అయితే ఆ నష్టం మొత్తం నిర్మాత నెత్తి మీదే పడుతుంది. హీరో ఇమేజ్ కు పెద్దగా డ్యామేజ్ ఉండదు కానీ, నిర్మాత ఆర్థికంగా చితికిపోతాడు. రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చే హీరోలు కొందరే ఉంటారు. పైరసీ, ఓటీటీ సమస్యలతో సతమతమవుతున్న నిర్మాతలకు, హీరోల ఖర్చులు భరించడం ఒక సవాలుగా మారిందని బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశారు.