సత్యదేవ్ ప్రామిసింగ్ హీరో, టాలెంటెడ్ హీరో కూడా.! టాలీవుడ్ కు విజయ్ సేతుపతి లాంటి వాడు అతను.ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. అయితే అతని సినిమాలను జనాలు ఓటీటీల్లో చూడటానికి ఇష్టపడతారు కానీ థియేటర్లలో చూడటానికి ఇష్టపడటం లేదు అని నిర్మాత సి.కళ్యాణ్ కామెంట్ చేశారు. సత్యదేవ్ ను హీరోగా పెట్టి ఆయన నిర్మించిన గాడ్సే మూవీ సత్యదేవ్ వల్లే ఫ్లాప్ అయ్యింది అన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ” మంచి సినిమా చేయాలని గాడ్సే తీశాం. అది మంచి సినిమానే. చాలా బాగా వచ్చింది. అయితే ప్రేక్షకులు ఆ సినిమాని ఓటీటీలో చూసినంతగా థియేటర్లో చూడలేదు. అయితే ఆ సబ్జెక్ట్ ని మోయగలిగే ఆర్టిస్ట్ కూడా కావాలి. ఈ సంగతి దర్శకుడికి ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఆ సబ్జెక్ట్ ని మోయగలిగేది తెలుగులో ఇద్దరే. పవన్ కళ్యాణ్, జూ. ఎన్టీఆర్. ఇందులో ఎవరు చేసినా గాడ్సే ఒక చరిత్ర సృష్టించేది.
పిల్లల్ని చదివించి, వారికీ ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లితండ్రులందరికీ ఇది రీచ్ అవుతుందని భావించాం. కానీ కుదరలేదు. ఇదొక్కటే బాధ వేసింది. అయితే ఈ సినిమాని ఎక్కడా కూడా రాజీపడకుండా తీశాం. ఎక్కడా వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో చేసిన సినిమా గాడ్సే. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ కు అతను రాలేదు.
షూటింగ్ లు ఉన్నాయని వెళ్ళిపోయాడు. హీరోగా సినిమాలు చేస్తే సరిపోదు. ప్రమోషన్ చేసుకోవాలి. అతను మంచి నటుడు, టాలెంటెడ్ కానీ అన్నీ తానై చేసుకోవాలి అనుకుంటాడు. అతన్ని హీరోని చేసిందే నేను(జ్యోతి లక్ష్మీ సినిమాని ఉద్దేశిస్తూ) ” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.