Calling Sahasra Review in Telugu: కాలింగ్ సహస్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుడిగాలి సుధీర్ ఆనంద్ (Hero)
  • స్పందన పిల్లి (Heroine)
  • డాలీ షా, శివబాలాజీ తదితరులు.. (Cast)
  • అరుణ్ విక్కిరాల (Director)
  • విజేష్ కుమార్ తయాల్ - చిరంజీవి పమిడి - వెంకటేశ్వర్లు కాటూరి (Producer)
  • మోహిత్ - మార్క్ కె.రాబిన్ (Music)
  • డి.శశికిరణ్ (Cinematography)
  • Release Date : డిసెంబర్ 01, 2023

“సుడిగాలి సుధీర్”గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన సుధీర్ ఆనంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “కాలింగ్ సహస్ర”. అతడు హీరోగా నటించగా విడుదలైన మునుపటి చిత్రం “గాలోడు” మంచి కలెక్షన్స్ సాధించడంతో ఈ తాజా చిత్రమైన “కాలింగ్ సహస్ర”ను మంచి ప్రమోషన్స్ తో విడుదల చేశారు. మరి ఈ సినిమాతో హీరోగా సుధీర్ ఎస్టాబ్లిష్ అవ్వగలిగాడా? లేదా? అనేది చూద్దాం..!!

కథ: బెంగళూరు నుండి హైద్రాబాద్ వచ్చిన సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ అజయ్ శ్రీవాస్తవ (సుడిగాలి సుధీర్) ఒక కొత్త సిమ్ తీసుకొంటాడు. కొత్త ఊరు, కొత్త లైఫ్ అనుకుంటున్న తరుణంలో వరుసపెట్టి ఎవరెవరో కాల్ చేసి “హలో సహస్ర” అంటుంటారు. కొందరు ఆరా తీస్తారు, కొందరు బెదిరిస్తారు. ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాయనా అనుకుంటున్న అజయ్ అనుకోకుండా ఒక మర్డర్ లో కూడా ఇన్వాల్వ్ అవుతాడు. అంతా ఈ సిమ్ కార్డ్ & లూసిఫర్ అనే యాప్ వల్ల జరుగుతుంది అని తెలుసుకొని.. రివర్స్ ఇంజనీరింగ్ మొదలెడతాడు. అసలు సహస్ర ఎవరు? అజయ్ తో సంబంధం ఏమిటి? ఈ లూసిఫర్ యాప్ ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “కాలింగ్ సహస్ర” చిత్రం.

నటీనటుల పనితీరు: నటుడిగా సుధీర్ ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. డైలాగ్ డెలివరే & యాక్షన్ సీన్స్ లో పర్లేదు కానీ.. ఎమోషనల్ డైలాగ్స్ & కళ్ళతో హావభావాలు పలికించాల్సివచ్చినప్పుడు మాత్రం తేలిపోతున్నాడు. డ్యాన్సులతో మాత్రం తన అభిమానుల్ని సంతుష్టులను చేస్తున్నాడు. డాలీషాకు రెగ్యులర్ హీరో వెనుకపడే హీరోయిన్ గా పాత్రలో అలరించడానికి ప్రయత్నించింది.

అయితే.. లిప్ సింక్ కానీ, నటన కానీ సరిగా లేకపోవడంతో ఆమె పాత్ర పండలేదు. శివబాలాజీకి చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్ర లభించింది. అతడు దానికి న్యాయం చేశాడు కూడా. రవితేజ కామెడీ టైమింగ్ & పంచ్ లు ఆకట్టుకుంటాయి. మిగతా పాత్రధారులు పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అరుణ్ ఒక సాధారణ కథను కొత్తగా చెప్పాలనుకున్నాడు. అయితే.. మూలకథలో ఉన్న ఇంట్రెస్ట్ స్క్రీన్ ప్లేలో లేకుండాపోయింది. అయితే.. అనవసరంగా కథను కమర్షియాలిటీ కోసం లేనిపోనివి యాడ్ చేయకుండా.. సింపుల్ గా ట్విస్టులతోనే అలరింపజేయాలని చేసిన ప్రయత్నం కాస్త ఫెయిల్ అయ్యింది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు అరుణ్. సెకండాఫ్ లో వరుస ట్విస్టులతో ఆకట్టుకోవడానికి ప్రయత్నించినా విడిపోయిన చిక్కుముడులు చూస్తే ఇప్పటివరకూ బిల్డ్ చేసిన టెన్షన్ అంతా వృధా అనే భావన కలుగుతుంది.

లాజికల్ గా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక థ్రిల్లర్ అది కూడా ఆత్మలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఒక పారానార్మల్ థ్రిల్లర్ ను తెరకెక్కించేప్పుడు స్క్రీన్ ప్లే & లాజిక్స్ ప్రోపర్ గా ఉండాలి అనే బేసిక్ విషయాన్ని దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల మంచి స్కోప్ ఉన్న కథ నీరుగారింది. మోహిత్ పాటల కంటే మార్క్ కె.రాబిల్ నేపధ్య సంగీతం బాగుంది.

ఆడియన్స్ లో మంచి టెన్షన్ క్రియేట్ చేసి ఎంగేజ్ చేయడంలో కీలకపాత్ర పోషించింది. శశికిరణ్ సినిమాటోగ్రఫీలో బడ్జెట్ కష్టాలు ఎక్కువగా కనిపించాయి. ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ లో కూడా అవి క్యారీ అయ్యాయి.

విశ్లేషణ: మంచి కథనం ఉంటే హిట్ గా నిలిచే సత్తా ఉన్న (Calling Sahasra) చిత్రం కాస్త క్వాలిటీ లేని ప్రొడక్షన్ డిజైన్ & లాజిక్స్ లేని కథనంతో ప్రేక్షకుల్ని నీరుగార్చింది. సుడిగాలి సుధీర్ అభిమానుల కోసం కొన్ని ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. ఈ నెలలో ఉన్న మహామహా చిత్రాల ముందు అవి ఏమాత్రం నిలబడవు. ఒక ఆర్టిస్ట్ ఫేమ్ ని బట్టి కాకుండా.. కథను బట్టి సినిమాలు తెరకెక్కించినప్పుడే సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొని, బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయి అనే విషయాన్ని దర్శకనిర్మాతలు అర్ధం చేసుకోవాల్సిన ఆవస్యకత ఎంతో ఉంది.

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus