కామెడీ సినిమాలకి చాలా వరకు కాలం చెల్లిపోయినప్పటికీ సంపూర్ణేష్ బాబు తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, వంటి సినిమాలు హిట్ అయ్యాయి. అటు తర్వాత ఆ ఫార్మెట్ లో చాలా సినిమాలు చేశాడు కానీ ఏవి కూడా ఆశించిన స్థాయిలో లేవు. కానీ క్యాలీఫ్లవర్ అనే చిత్రంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈరోజు మనముందుకు వచ్చాడు సంపూ. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : ఆంగ్లేయుడు అయిన ఆండీ ఫ్లవర్ ( పెద సంపూర్ణేష్ బాబు) భారత దేశానికి వచ్చి ఇక్కడ స్త్రీల గొప్పతనాన్ని తెలుసుకుని ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుని బిడ్డల్ని కంటాడు. కొన్నాళ్ళకి ఆండీ ఫ్లవర్ మనవడు అయిన క్యాలీఫ్లవర్ (బుల్లి సంపూర్ణేష్ బాబు) కూడా… తన తాత బాటలోనే నడవాలి అనుకుంటాడు. అందుకోసమే 35 ఏళ్ళు వరకు అమ్మాయిలకి దూరంగా ఉంటూ తన శీలాన్ని కాపాడుకుంటూ వస్తాడు. కానీ ముగ్గురు అమ్మాయిలు అతన్ని ట్రాప్ చేసి దారుణంగా రేప్ చేస్తారు. దాంతో తనకి న్యాయం చేయమని కోర్టుకి ఎక్కుతాడు. మరి అతనికి న్యాయం జరిగిందా లేదా అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : సంపూర్ణేష్ బాబు తన మార్క్ కామెడీ పండించాలని తెగ ట్రై చేశాడు. అతను కొత్తగా ట్రై చేసింది ఏమీ లేదు. నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడలేదు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ కలిగిన పాత్రే సంపూది. ఇతని తర్వాత గుర్తుంచుకునే పాత్ర పోసాని ప్లే చేశాడు.హీరోయిన్లు ఎలా చేసినా స్క్రీన్ పైన అతి చేసినట్టే ఉంది. మిగిలిన పాత్రలు పెద్దగా గుర్తుండవు.
సాంకేతికవర్గం పనితీరు : సంపూ సినిమా అనగానే పేరడీ సన్నివేశాలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి.. దర్శకులకి స్క్రిప్ట్ పైన పెద్ద పనిచేయనవసరం లేదు. ఇక్కడ దర్శకుడు ఆర్కే కూడా అదే ఫీల్ అయినట్టు ఉన్నాడు. అది అతని తప్పు కాదు.. కాకపోతే పేరడీ కామెడీ అని తెలిసినా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. అలా చేస్తే విసుగు పుడుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి అని చెప్పడం కన్నా దీనికి ఇది ఎక్కువే అన్నట్టు ఉన్నాయి. నేపథ్య సంగీతం, ఎడిటింగ్ అన్నీ అంతే..!
విశ్లేషణ : ఇందాక చెప్పుకున్నట్టు సంపూ సినిమాని కథ కోసం ఎవ్వరూ వెళ్ళరు. అసలు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉండరు. కాకపోతే వీకెండ్ కు ఏదో ఒక సినిమా చూడాలి…సోషల్ మీడియాలో ఇంకొకల్ని ట్రోల్ చేయడానికి స్టఫ్ కావాలి అనుకున్న వాళ్ళు వెళ్తారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ క్యాలీఫ్లవర్ చెవిలో పెట్టినట్టే ఉంటుంది.