బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సెలినా జైట్లీ(Celina Jaitley) తన వైవాహిక జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతుంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్, తన భర్త పీటర్ హాగ్‌పై ఆమె ముంబైలోని అంధేరి కోర్టులో గృహ హింస కేసు (డొమెస్టిక్ వయొలెన్స్ కేస్) వేసింది. గత 15 ఏళ్ల కాపురంలో భర్త తనకు నరకం చూపించాడని, తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపిస్తూ ఏకంగా రూ.100 కోట్ల భారీ నష్టపరిహారం డిమాండ్ చేసింది.
సెలినా తన పిటిషన్‌లో భర్తపై దారుణమైన ఆరోపణలు గుప్పించింది. పీటర్ హాగ్ తనను కేవలం మానసికంగా, శారీరకంగానే కాకుండా లైంగికంగా కూడా వేధించాడని పేర్కొంది. తన అనుమతి లేకుండా క్రెడిట్ కార్డులు వాడేసి అకౌంట్ల నుంచి డబ్బులు దొంగిలించాడని, కనీసం తన సొంత సంపాదనపై కూడా తనకు అధికారం లేకుండా చేశాడని కోర్టుకు విపులంగా వివరించింది.
చిన్న చిన్న ప్రాజెక్టులు ఒప్పుకోవాలన్నా భయపడే పరిస్థితి కల్పించి, తన కెరీర్‌ను అడ్డుకుని, పూర్తిగా ఆర్థికంగా అతనిపైనే ఆధారపడేలా చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు, ఈ వేధింపులకు గానూ రూ.100 కోట్ల పరిహారంతో పాటు, తనకు జీవనభృతిగా నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని సెలినా కోర్టుని కోరింది. అంతేకాకుండా, ప్రస్తుతం ఆస్ట్రియాలో భర్త దగ్గరే ఉన్న తన ముగ్గురు పిల్లల బాధ్యత కూడా తనకే అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.
ఈ కేసును విచారించిన అంధేరి మెట్రోపాలిటన్ కోర్టు.. జనవరి 27 లోగా ఇద్దరూ తమ ఆదాయ వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే సెలినా ఆరోపణలపై పీటర్ వివరణ ఇవ్వాలని సూచించింది. కాగా, పీటర్ హాగ్ ఇప్పటికే ఆగస్టులో ఆస్ట్రియా కోర్టులో విడాకుల కోసం అప్లై చేసినట్లు సమాచారం.