క్యూట్ స్టార్ నితిన్ హీరోగా “రౌడీ ఫెలో” చిత్రంతో దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య తన రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన చిత్రం “చల్ మోహన్ రంగ”. నితిన్ సరసన మేఘ ఆకాష్ వరుసగా రెండోసారి నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించడం, పవన్ కళ్యాణ్ తన స్వంత బ్యానర్ మీద చిత్రాన్ని నిర్మించడం విశేషం. నితిన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ వస్తే ఆ సినిమా హిట్ అనేది నితిన్ నమ్మకం, “ఇష్క్” సినిమాకి అది పనికొచ్చింది కూడా. మరి “చల్ మోహన్ రంగ”కి పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ ఏమేరకు వర్కవుట్ అయ్యిందో చూద్దాం..!!
కథ :
చిన్నప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి కోసం కంటే సెటిల్ అవ్వడం కోసం అమెరికా వెళ్లాలనుకొనే మనస్తత్వం ఉన్న యువకుడు మోహన్ రంగ (నితిన్). మూడుసార్లు వీసా రిజెక్ట్ అవ్వడంతో ఓ బామ్మ మృతదేహాన్ని అమెరికా చేర్చే నెపంతో అమెరికా చేరుకొంటాడు. అక్కడ అనుకోకుండా కలిసిన తన చిన్నప్పటి ప్రేమికురాలు మేఘ (మేఘ ఆకాష్)తో మళ్ళీ ప్రేమలో పడతాడు. కానీ.. ప్రేమను పంచుకోకుండా మనసులోనే దాచేసుకోవడం వల్ల కలవలేకపోతారు.
ఈలోపు మోహన్ రంగ జాబ్ పరంగా సెటిల్ అవ్వడం, మేఘకి వేరే అబ్బాయిలో పెళ్లి ఫిక్స్ అవ్వడం జరిగిపోతాయి. అయితే.. ఆ పెళ్లి ఊహించని విధంగా వాయిదా పడుతుంది. మరి ఈ వాయిదా గ్యాప్ లో మోహన్ రంగ-మేఘ మళ్ళీ కలుసుకొన్నారా? లేదా? అనేది “చల్ మోహన్ రంగ” కథాంశం.
నటీనటుల పనితీరు :
సినిమా మీద త్రివిక్రమ్ ప్రభావం ఎక్కువగా ఉండడం వలనో లేక కథ ఆయన అందించడం వలనో తెలియదు కానీ.. సినిమా చూస్తున్నంతసేపూ నితిన్ పెర్ఫార్మెన్స్ “అ ఆ” సినిమాలోని ఆనంద్ విహారిణి గుర్తుకుతెస్తుంది. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ కాబట్టి అలా కంటిన్యూ అయిపోయాడో లేక ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది కదా అని ఆ ఫార్మాట్ ను ఫాలో అయిపోయాడో నితిన్ కే తెలియాలి. అయితే.. ఎమోషన్స్, కామెడీ విషయంలో నితిన్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. మేఘ ఆకాష్ నటిగా ఇంప్రూవ్ అవ్వకపోగా.. ఇంకాస్త డంబ్ గా తయారయ్యింది. “లై” చిత్రంలో చలాకీ పిల్లగా ఆకట్టుకొన్న మేఘ ఈ చిత్రంలో చాలా కీలక సన్నివేశాల్లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వకుండా బ్లాంక్ ఫేస్ పెట్టడం అనేది మైనస్.
చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరకు తల్లి పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన నిన్నటితరం కథానాయకి లిజీ స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఆమె పాత్ర కూడా చాలా పేలవంగా ఉంది. మధునందన్, పమ్మి శ్రీనివాస్ ల పాత్రలు హాస్యాన్ని పండించడంలో సఫలీకృతమయ్యాయి. సెకండాఫ్ లో పమ్మీ శ్రీనివాస్ కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నర్రా శ్రీనివాస్, రావు రమేష్ ల పాత్రలకి ఒక పర్టీక్యులర్ క్యారెక్టరైజేషన్స్ లేకపోవడంతో వారి సన్నివేశాలు మాత్రం సాగదీసినట్లుగా అనిపిస్తాయి.
సాంకేతికవర్గం పనితీరు : తమన్ సంగీతం కంటే నేపధ్య సంగీతం చాలా బాగుంది. వయోలిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాలోని ఎమోషన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఒక్క “ఘ ఘ మేఘ” మినహా మిగతా పాటలన్నీ తమన్ పాత పాటలను గుర్తుకుతెచ్చాయి.
నటరాజన్ సుబ్రమణియం సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. కొన్ని భావాలను కెమెరా ఫ్రేమ తోనే పలికించి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చేశాడు. అమెరికా, ఊటీ ప్రాంతాలను తన లెన్స్ తో మరింత అందంగా చూపించాడు.
మాటల్లో ప్రాసలు బాగా ఎక్కువయ్యాయి అనిపిస్తుంది. అంతలోనే కథ అందించింది త్రివిక్రమ్ కదా అని గుర్తొచ్చినప్పుడు “ఈ మాత్రం ఉంటాయిలే” అనిపిస్తుంది. అలాగే.. స్క్రీన్ ప్లే, సీన్ కంపోజిషన్ విషయంలో త్రివిక్రమ్ కొట్టొచ్చినట్లు కనిపిస్తాడు. “ఎవ్రీ థింగ్ ఈజ్ ఏ సైన్” అనే ఫార్మాట్ ను బేస్ చేసుకొని రాసుకోన్న సన్నివేశాలు బాగున్నాయి. “జాకీ, వి.ఐ.పీ” ఎపిసోడ్ ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది.
దర్శకుడిగా తన తొలి చిత్రమైన “రౌడీ ఫెలో”తో తన మార్క్ వేయగలిగిన కృష్ణ చైతన్య “చల్ మోహన్ రంగ” విషయంలో మాత్రం త్రివిక్రమ్ కథను, ఫార్మాట్ ను ఫాలో అయిపోయాడే తప్ప తన మేకింగ్ స్టైల్ ను ఎక్కడా ప్రేక్షకులకి రుచి చూపించలేదు. అందువల్ల ఎవరో త్రివిక్రమ్ అసిస్టెంట్ సినిమా తీసి ఉంటాడు అని ఆడియన్స్ కి అనిపిస్తుందే తప్ప “రౌడీ ఫెలో” డైరెక్టర్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు అనిపించదు. ఇక కామెడీ కోసం కొన్ని, పంచ్ ల కోసం ఇంకొన్ని సన్నివేశాలు అనవసరంగా పొడిగించడంతో సినిమా కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. లెంగ్త్ విషయంలోనో లేక సన్నివేశాల ఎగ్జిక్యూషన్ లోనో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అయితే.. డైలాగ్ రైటర్ గా మాత్రం విశేషమైన రీతిలో ఆకట్టుకొన్నాడు కృష్ణ చైతన్య. “ఇదివరకు లైఫ్ లో అన్నీ వదిలేస్తే సన్యాసి అనేవారు, ఇప్పుడేంట్రా సక్సెస్ అంటున్నారు?”, “విడిపోయి గొడవడం కంటే.. కలిసుండి గొడవపడడం బాగుంటుంది” వంటి సంభాషణలు ఆకట్టుకొంటాయి.
విశ్లేషణ :
“రంగస్థలం” బాక్సాఫీసు విజృంభణ కాస్త తగ్గడం, ఈమధ్య కాలంలో సరైన కామెడీ సినిమా రాకపోవడంతో.. “చల్ మోహన్ రంగ” సాఫ్ట్ ఫిలిమ్స్ ను కోరుకొనే ప్రేక్షకులకు ఓ మోస్తరుగా నచ్చుతుంది. ఎలాగూ క్లాస్ సినిమా కాబట్టి ఓవర్సీస్ అండ్ మల్టీప్లెక్స్ ల వరకూ బాగానే ఆడుతుంది. మాస్ ఆడియన్స్ సినిమాని ఎంతవరకు ఓన్ చేసుకొంటారు అనేదాన్ని బట్టి బాక్సాఫీసు వద్ద సినిమా ఏ స్థాయి విజయాన్ని నమోదు చేస్తుంది అనేది ఆధారపడి ఉంది.