సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఆ చీకటి రోజులు ఇంకా ఎవరూ మర్చిపోలేదు. 2017లో కారులో ఒక ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, నరకం చూపించిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళ స్టార్ హీరో దిలీప్ జీవితం గత ఎనిమిదేళ్లుగా కోర్టు మెట్ల మీదే గడిచింది. అయితే ఇప్పుడు ఆ సుదీర్ఘ ఉత్కంఠకు ఎర్నాకులం కోర్టు ఒక సంచలన తీర్పుతో తెరదించింది.
“ఇదంతా దేవుడి దయ.. నాపై జరిగిన కుట్ర పటాపంచలైంది” అంటూ తీర్పు రాగానే దిలీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో న్యాయస్థానం ఈ స్టార్ హీరోను నిర్దోషిగా ప్రకటించింది. కుట్ర కోణంలో దిలీప్ 8వ నిందితుడిగా ఉన్నా, అది రుజువు కాలేదు. దీంతో ఇన్నాళ్లుగా తనపై ఉన్న మచ్చ తొలగిపోవడంతో దిలీప్, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
దిలీప్ బయటపడ్డారు కానీ, ప్రధాన నిందితుడు పల్సర్ సునీతో పాటు, అతనికి సహకరించిన మార్టిన్, మణికందన్ వంటి మరో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. కిడ్నాప్, సామూహిక దాడి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద వీరు నేరం చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. వీరికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందనేది డిసెంబర్ 12న ఖరారు కానుంది.
ఈ కేసు ఇంతకాలం సాగదీయడానికి, హీరోపై ఆరోపణలు నిలబడకపోవడానికి ప్రధాన కారణం సాక్షులు ప్లేట్ ఫిరాయించడమే. విచారణలో భాగంగా ఏకంగా 28 మంది సాక్షులు మాట మార్చేశారు. ఇందులో ఇండస్ట్రీకి చెందిన బడా వ్యక్తులు కూడా ఉండటం గమనార్హం. 261 మందిని విచారించినా, కుట్ర కోణాన్ని నిరూపించే బలమైన సాక్ష్యం దొరక్కపోవడం దిలీప్ కు కలిసొచ్చింది. తీర్పు సమయంలో బాధితురాలు కూడా కోర్టులోనే ఉండటం అందరినీ కలిచివేసింది. ఎనిమిదేళ్ల క్రితం కారులో రెండు గంటల పాటు ఆమె అనుభవించిన వేదనకు పూర్తి న్యాయం జరిగిందా లేదా అనేది ఇంకా చర్చనీయాంశమే.
