నేడు చిత్ర పరిశ్రమలో భారీ పోటీ నెలకొని ఉంది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా హీరోగా అవకాశం రావడమే కష్టమైన పని.. అటువంటిది నిలబడాలంటే మరింత కష్టపడాలి. అంతలా శ్రమించాడు కాబట్టే నాగశౌర్య టాలీవుడ్ యువహీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను తాజాగా చేసిన మూవీ ఛలో. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించిన ఈసినిమాని వెంకీ కుడుముల తెరకెక్కించారు. అతను సినిమాని చక్కగా రూపొందించడమే కాదు.. ప్రచారాన్ని కూడా బాగా చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్స్ తో రచ్చ చేసి ప్రేక్షకుల అటెన్షన్ లాగే ప్రయత్నాలు చేయకుండా పాజిటివ్ ఆలోచనలతో చిత్ర బృందం ముందుకు సాగుతోంది. ఈ చిత్ర టీజర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో రిలీజ్ చేసి ప్రారంభంలోనే మంచి పేరు రప్పించుకున్నారు.
ఆ తర్వాత సినిమాలోని ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు. అంతేకాదు నాగశౌర్య కాలేజీలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతున్నారు. వారితో సరదాగా గడుపుతూ సినిమాలోని ప్రత్యేకతలు వివరిస్తున్నారు. ఇలా క్షణం తీరిక లేకుండా ఛలో చిత్రాన్ని యువత చెంతకు తీసుకు వెళ్తున్నారు. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ లు ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా పిలిచారు. అతను ఒకే చెప్పిన రోజున వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ఆరు కోట్లతో నిర్మితమైన ఛలో ఫిబ్రవరి 2 న రిలీజ్ కానుంది.