ఛలో

వరుస పరాజజాయలతో హీరోగా తన ఉనికిని కోల్పోయే స్థాయికి చేరుకొన్న నాగశౌర్య కథానాయకుడిగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నమే “ఛలో”. తన చిరకాల స్నేహితుడు వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తూ “ఐరా క్రియేషన్స్” అనే సంస్థను స్థాపించి మరీ నిర్మించిన సినిమా కూడా కావడంతో ఎన్నడూలేని విధంగా విపరీతంగా పబ్లిసిటీ చేసి ప్రేక్షకుల్లో సినిమా గురించి పాజిటివ్ బజ్ తీసుకురాగలిగారు. ట్రైలర్, సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడంతో అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. మరి “ఛలో” ఆ అంచనాలను అందుకోగలిగిందా? కథానాయకుడిగా నాగశౌర్యకి మంచి హిట్ ఇచ్చిందా? అనేది తెలియాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే..!!

కథ : అక్షరాభ్యాసం రోజు నుంచి ఎదుటి వ్యక్తిని కొట్టడం లేదా గొడవపడడం వల్ల సంతోషపడడం అలవాటు చేసుకొన్న యువకుడు హరి (నాగశౌర్య). ఆ గొడవల పైత్యం ఏ స్థాయికి చేరుకుంటుందంటే రోడ్డు మీద రెండు వర్గాల వారు కొట్టుకొంటున్నా కూడా అందులో దూరి మరీ ఒకరిద్దర్ని కొట్టి తన చేతి దురద తీర్చుకొనేంత. అయితే.. కొడుకు ఇలా గొడవల్లో కాళ్ళూ-చేతులు పెట్టడం వాడి భవిష్యత్ కు మాత్రమే కాక తన ప్రాణానికి కూడా మంచిది కాదని భావించిన తండ్రి (నరేష్) “అరుణాచలం” సినిమాలో పెద్ద రజనీకాంత్ ఫాలో అయిన “చుట్ట కాన్సెప్ట్” ను తన కుమారుడిపై ప్రయోగించాలని ఎక్కువ గొడవలు జరిగే తిరుప్పురం అనే ఊరికి హరి స్టడీస్ ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు. (ఎక్కువగా గొడవలు పడడం వల్ల గొడవలంటే ఇంట్రెస్ట్ పోతుందేమోనని) ఒక విచిత్రమైన కారణం వల్ల ఒకే ఊరు రెండుగా (తెలుగోళ్ళు, తమిలోళ్ళు) విడిపోయి కుదిరినప్పుడల్లా కొట్టుకుఛస్తుంటారు. ఎక్స్ పెక్ట్ చేసినట్లుగానే హీరో హరి విలన్ కూతురు కార్తీక (రష్మిక)ను ప్రేమిస్తాడు. మరి తన ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో ఆ రెండు ఉర్లను ఎలా కలిపాడు? అసలు ఒకే ఊరు రెండుగా విడిపోవడానికి గల కారణం ఏమిటి? అనేది ఆసక్తికరమైన అంశానికి వీలైనంత ఎంటర్ టైన్మెంట్ ను జోడించి చెప్పిన కథే “ఛలో”.

నటీనటుల పనితీరు : ఇప్పటివరకూ లవర్ బోయ్ గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్న నాగశౌర్య “ఛలో”లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్ ను బాగా ఎస్టాబ్లిష్ చేయడంతో అతడి పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. శౌర్య క్యారెక్టర్ కు మాగ్జిమమ్ యూత్ కనెక్ట్ అవుతారు. వరుస పరాజయాలతో కెరీర్ పరంగా ఢీలాపడిన శౌర్యకి “ఛలో”తో ఊరట లభించినట్లే. కన్నడ “కిరిక్ పార్టీ”తో యావత్ సౌత్ ఇండియన్ యూత్ ఆడియన్స్ అందరి మనసుల్లో తన సహజమైన అందం-నటనతో చెరగని సంతకం చేసిన రష్మిక మందన “ఛలో” చిత్రంలోనూ సహజమైన నటనతో అలరిస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సత్య కామెడీ టైమింగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. తమిళ యువకుడిగా చెన్నై స్లాంగ్ లో సత్య సింగిల్ లైన్ పంచ్ లు భీభత్సంగా పేలాయి. అలాగే సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ పైశాచిక భగ్న ప్రేమికుడిగా నవ్విస్తాడు. అతడి క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. నరేష్, ప్రగతి, మొట్ట రాజేంద్ర, మైమ్ గోపి, రఘుబాబు లాంటి సీనియర్ ఆర్టిస్ట్స్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రిచ్ గా ఉంది. హీరోహీరోయిన్స్ ని వీలైనంత అందంగా చూపడమే కాక పాటల్ని వీలైనంత సహజంగా చిత్రీకరించారు. కాకపోతే విలన్స్ విలనిజాన్ని వాళ్ళ మొహాల్లో కోపాన్ని, కసిని ఎలివేట్ చేయడం కోసం రిపీటెడ్ గా యూజ్ చేసిన జూమిన్ షాట్స్ కాస్త ఇబ్బందిపెడతాయి. సాగర్ మహతి స్వరపరిచిన బాణీల్లో “చూసీ చూడంగానే నచ్చేశావే” ఎంత పెద్ద హిట్ అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. మిగతా పాటల్లో తమిళతనం ఎక్కువగా వినిపించగా.. నేపధ్య సంగీతం అక్కడక్కడా మణిశర్మ పాత పాటల్ని తలపిస్తుంది. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. గ్రీన్ మ్యాట్ షాట్స్ మినహా ఎక్కడా ప్రొడక్షన్ పరంగా మైనస్ పాయింట్స్ కనిపించవు. కొడుకు మీద ప్రేమతో నిర్మాత ఉషా గారు ఎక్కడా రాజీపడలేదు అని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తూనే ఉంటుంది.

దర్శకుడు వెంకీ కుడుముల రాసుకొన్న కథ “బిందాస్” చిత్రాన్ని కాస్త గట్టిగానే జ్ణప్తికి తెస్తుంది. ఇక కాన్ఫ్లిక్ట్ పాయింట్ “చిన్న సినిమా” (2013) చిత్రాన్ని గుర్తుకుతెస్తుంది. అయితే.. డైలాగ్ రైటర్ గా సింగిల్ లైన్ పంచ లతో త్రివిక్రమ్ శిష్యుడు అని నిరూపించుకొన్నాడు. “ఒక్క దోమ కుట్టిందని ఆలౌట్ పెట్టి దోమలన్నిట్నీ చంపడం లేదా?” లాంటి హిలేరియస్ పంచ్ డైలాగ్స్ సినిమాలో ఒక పదిపదిహేను ఉన్నాయి. అయితే.. కథకుడిగా మాత్రం తడబడ్డాడు వెంకీ కుడుముల. స్క్రీన్ ప్లేలో చాలా సన్నివేశాలకి కంటిన్యుటీ లేదు. షాట్ డీవియేషన్స్ త్రివిక్రమ్ టేకింగ్ ను తలపిస్తాయి. అయితే.. పరిచయ చిత్రం కాబట్టి కొద్దిపాటి తట్టరపాటు ఉండడం అనేది సర్వసాధారణం. నిర్మాణ బృందం కూడా కొత్తవారే కావడంతో ఎవరికీ పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం కూడా అవుట్ పుట్ పై ఎఫెక్ట్ చూపింది.

విశ్లేషణ : స్క్రీన్ ప్లేలో చిన్నపాటి ల్యాగ్, స్టోరీ, కాన్ఫ్లిక్ట్ పాయింట్ లో సరిగా లాజిక్స్ లేకపోవడం వంటి విషయాల్ని కాస్త సైడ్ ట్రాక్ చేస్తే “ఛలో’ హిలేరియస్ గా కాకపోయినా ఓ మోస్తరుగా ఎంటర్ టైన్ చేసే యూత్ ఫుల్ ఫిలిమ్. నాగశౌర్యకి మాత్రం మంచి హిట్ అనే చెప్పాలి. దర్శకుడు వెంకీ కుడుముల ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమాకి సూపర్ హిట్ అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయి. ఈరోజు విడుదలవుతున్న రవితేజ మాస్ మసాలా చిత్రం “టచ్ చేసి చూడు” రిజల్ట్ ని బట్టి “ఛలో” ఫేట్ డిసైడ్ అవుతుంది.

రేటింగ్ : 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus