ఆడవాళ్ళ డ్రెస్సింగ్ పై రీసెంట్ గా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి సింగర్ చిన్మయి తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. బట్టలు కారణం కాదని, మనుషుల మైండ్ సెట్ లోనే లోపం ఉందని ఆమె స్ట్రాంగ్ గా వాదించారు. కేవలం ఆవేశం కాకుండా, కొన్ని సాక్ష్యాలను, ఉదాహరణలను చూపిస్తూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
కేరళలో నిండుగా చీర కట్టుకున్న మహిళపై బస్సులో జరిగిన దాడిని చూపిస్తూ, పద్ధతిగా ఉంటే సేఫ్ అనే వాదనను ఆమె తిప్పికొట్టారు. అలాగే శివాజీ ప్రస్తావించిన దివంగత నటి సౌందర్య గురించి మాట్లాడుతూ, ఆమె ఎంతో సంప్రదాయంగా ఉండేవారని, అయినా ఈ మధ్య ఏఐ టెక్నాలజీతో ఆమె ఫోటోలను కూడా అసభ్యంగా మార్ఫింగ్ చేస్తున్నారని గుర్తుచేశారు. చనిపోయిన వారిని, పద్ధతిగా ఉన్నవారిని కూడా ఈ సమాజం వదలడం లేదని, దీనికి బట్టలు ఎలా కారణం అవుతాయని ఆమె లాజికల్ గా ప్రశ్నించారు.
నిజానికి చాలా నేరాలు బయట వ్యక్తుల కంటే, సొంత కుటుంబ సభ్యులు, తెలిసిన వారి నుంచే జరుగుతున్నాయని చిన్మయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్నప్పుడు బట్టల ప్రస్తావన రాదు కదా, మరి అక్కడ ఎందుకు దాడులు జరుగుతున్నాయని ఆమె నిలదీశారు. తనకు కూడా ఒంటి నిండా బట్టలు, చున్నీ వేసుకున్నప్పుడే చేదు అనుభవం ఎదురైందని, కాబట్టి సమస్య బట్టల్లో లేదని తేల్చిచెప్పారు.
బట్టల మీద నెపం నెట్టేవారంతా ‘రే**ప్ అపాలజిస్ట్’లని ఆమె తీవ్రంగా విమర్శించారు. ఈ రోజుల్లో చిన్న పిల్లలు, మగవాళ్ళు కూడా లైంగిక దాడులకు గురవుతున్నారని, మరి వాళ్ళు కూడా చీరలు కట్టుకోవాలా అని ఆమె ఘాటుగా స్పందించారు. రే**ప్ జరగడానికి ఏకైక కారణం రేపిస్ట్ మాత్రమే తప్ప, బాధితులు కాదని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేసేవాడి వక్రబుద్ధి మారాలే తప్ప, ఆడవాళ్ళ బట్టల మీద పడి ఏడవద్దని, తన కొడుకును మాత్రం స్త్రీలను గౌరవించేలా పెంచుతానని ఆమె హితవు పలికారు.