ఈరోజు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏఎన్నార్ (Akkineni Nageswara Rao) నేషనల్ అవార్డు ప్రధానోత్సవం వేడుకని నిర్వహించారు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్. అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతిని పురస్కరించుకుని చిరంజీవికి అవార్డు ప్రకటించడం.. ఈరోజు అందజేయడం జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న ప్రతి సమయంలోనూ ఆదుకుంటూ వచ్చారు. బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి ఎంతోమందికి ప్రాణదానం పోశారు. కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలెండర్లు అందించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. అలాగే షూటింగ్లు వంటివి ఆగిపోయి పేద కళాకారులు ఇబ్బంది పడుతుంటే వారికి నిత్యావసరాలు అందించారు.
విరాళాలు సేకరించి.. వారిని ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.ఈ సేవలన్నిటినీ గుర్తించే ఆయనకు పద్మ విభూషణ్ వంటి గొప్ప అవార్డులు ఎన్నో లభించాయి.నాగార్జున కూడా ఏఎన్నార్ నేషనల్ అవార్డుని కూడా ఇచ్చి సత్కరించింది కూడా అందుకే..! ఈ క్రమంలో చిరంజీవి స్పీచ్ ఇస్తూ కొంచెం గతాన్ని తవ్వుకున్నారు. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే ఉద్దేశం మీద నేను లెజెండరీ అవార్డుని వజ్రోత్సవాల్లో తీసుకోలేదు.
ఇండస్ట్రీలో ఉన్న నా సోదరులు, పెద్దలు, మిత్రులు అందరూ కలిసి నాకు లెజెండరీ అవార్డుని అందించి సత్కరించాలని భావించారు. కానీ నా సహచరులు కొంతమంది ఆ టైంలో ఓర్చుకోలేక అభ్యంతరం తెలిపారు. కాబట్టి.. అప్పుడు నేను ఇంట గెలవలేదు. కానీ ఈరోజు నా స్నేహితుడు నాగార్జున (Nagarjuna).. పెద్ద లెజెండ్ అయినటువంటి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వంటివారిని తీసుకొచ్చి నాకు ఈ ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందజేయడంతో ఇప్పుడు నేను ఇంట గెలిచిన అనుభూతిని పొందుతున్నాను’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
చిరు కామెంట్స్ మోహన్ బాబుని (Mohan Babu) ఉద్దేశించినవే. 2007 లో జరిగిన వజ్రోత్సవాల్లో చిరంజీవికి లెజెండరీ అవార్డు ఇస్తున్న టైంలో మోహన్ బాబు అసహనం వ్యక్తం చేశారు. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈరోజు చిరు ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది అని స్పష్టమవుతుంది.