4 ఏళ్ళ పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన దారుణమైన సంఘటన గురించి మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై దారుణమైన అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు. ఈ సంఘటన ఎంతోమందిని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ను, సపోర్ట్ చేసిన ప్రిన్సిపాల్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ ఘోరమైన ఘటనపై ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి కూడా ఈ ఘటన పై స్పందించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందిస్తూ… “నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం,అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది.ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా,
ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. చిరు చేసిన ఈ ట్వీట్ కు అభిమానులు కూడా మద్దతు పలుకుతూ ‘వీళ్ళని మాత్రమే కాదు ఇలాంటి ఘోరాలు చేసినప్పటికీ సపోర్ట్ చేసే వాళ్ళని మరింత కఠినంగా శిక్షించాలి..
‘తప్పు చేసే వాడిని.. తప్పు చేయించేవాడిని కఠినంగా శిక్షిస్తే అప్పుడు తప్పు చేయాలనే ఆలోచన వస్తేనే చాలా మంది భయపడతారు’ అంటూ కామెంట్లు పెడుతూ ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తున్నారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.