ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చాలా రచ్చ జరిగింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కీలక విషయం చర్చల్లోకి వచ్చింది.ఈ క్రమంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాక్యలపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు అయినటువంటి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు.. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కదిలి వెళ్లడం జరిగింది.
ఆ టైంలో చిరంజీవి.. మహేష్ బాబు, ప్రభాస్..లను తీసుకువెళ్తే ఆపినందుకు చిరంజీవి గట్టిగా మాట్లాడారని కామినేని కామెంట్స్ చేయడం జరిగింది. వాటిని బాలకృష్ణ ఖండించడం జరిగింది. ‘చిరంజీవి గట్టిగా నిలదీశారు అనేది అబద్దం. ఆ టైంలో ఎవ్వరూ జగన్ ను నిలదీసింది లేదు. అంతేకాదు ‘గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నాకు అవమానం జరిగింది.
ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) సమావేశంలో నా పేరును 9వ స్థానంలో పెట్టారు.ఆ లిస్ట్ తయారు చేసింది ఎవరు. నాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు నేను ఫోన్ చేసి ఆరా తీయడం జరిగింది’ అంటూ బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు.
ఇక బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. “నా గురించి అసెంబ్లీలో బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడటాన్ని నేను గమనించాను. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కబురు పంపిస్తేనే నేను ఆయన్ని కలవడానికి వెళ్లడం జరిగింది. అందులో వేరే ఆలోచన, అభిప్రాయం వంటివి నాకు లేవు. సమయం ఇస్తే మేము వచ్చి కలిసి మా సమస్యలు చెబుతామని విన్నవించుకున్నాం.
తర్వాత అందరం కలిసి వెళ్లి సమస్యల గురించి ఆయన వద్ద చెప్పుకోవడం జరిగింది. మధ్యలో నేను బాలకృష్ణ గారిని ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. తర్వాత జెమిని కిరణ్ గారికి ఈ విషయం చెప్పి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన కూడా బాలకృష్ణ గారిని కలిసి విషయం అందించలేకపోయారు’ అంటూ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.