మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘వాల్తేర్ వీరయ్య’. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు ఈ సినిమాను మరింత ప్రమోట్ చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఓ విషయాన్ని వెల్లడించారు. ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో చిరంజీవి పల్లీలు నములుతూ.. దాని పొట్టుని మాస్ గా గాల్లోకి ఊదే సన్నివేశం ఉంటుంది.
ఈ సన్నివేశం కోసం తన ఇంట్లో జరిగిన ఓ సరదా ఇన్సిడెంట్ ను బయటపెట్టారు చిరంజీవి. ఈ సీన్ కోసం చిరంజీవి స్పెషల్ గా ఇంట్లోనే పల్లీల పొట్టుని సిద్ధం చేసుకున్నారట. ఇంట్లో పనిమనిషికి విషయం చెప్పి.. పల్లీల పొట్టు ఇవ్వమని అడిగితే.. దానికి ఆమె కావాలంటే పల్లీలు ఇస్తానని.. పొట్టు ఇవ్వనని చెప్పిందట. ఆమె అలా అనేసరికి ఏం చెప్పాలో అర్ధం కాలేదని చిరు గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద ఆవిడకి సర్దిచెప్పి, ఒప్పించి ఒక ప్యాకెట్ నిండా పల్లీల పొట్టు పట్టుకొని లొకేషన్ కి వెళ్లానని చిరంజీవి చెప్పుకొచ్చారు.
పాత్ర విషయంలో తను అంత నిబద్ధతతో ఉన్నానని.. షాట్ టైంకి పల్లీల పొట్టు దొరక్కపోతే ఇబ్బంది అవుతుందని.. ఇంటి నుంచే పొట్టు తీసుకెళ్లానని తెలిపారు. అలానే సినిమాలో బాడీ డబుల్ చేయడానికి కూడా తను అంగీకరించలేదని చెప్పారు చిరంజీవి. సినిమాలో వాటర్ సీక్వెన్స్ లో ప్రతి షాట్ లోనూ తను నటించడం చూసి కెమెరామెన్ ఆశ్చర్యపోయారని.. డూప్ పెట్టి తీసుకుందామని అతడు చెప్పినా తను వినలేదని చెప్పుకొచ్చారు.
డబ్బులు తీసుకునేది నటించడానికేనని.. ఎంతకష్టమైనా పడతానని అన్నారు. ఇక ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాలో చిరు గెటప్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. ఆయన మాస్ పెర్ఫార్మన్స్ ను థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.