నా తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఇలానే జరిగింది – చిరంజీవి

  • August 20, 2018 / 06:08 AM IST

అయినవాళ్లకు ఏమైనా అయితే మెగాస్టార్ చిరంజీవి కాస్త ఆలస్యంగా స్పందిస్తారేమోగానీ.. పరిశ్రమలోని వారికీ ఏమైనా బాధ కలిగితే అరక్షణం కూడా ఆలస్యం లేకుండా స్పందిస్తారని మరో సారి రుజువు చేశారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా రిలీజ్ కి ముందే నెట్లో ప్రత్యక్షం కావడంపై తాజాగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పరిశ్రమలో పనిచేస్తూ.. లీక్ చేస్తే.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే అవుతుందని ఆయన హెచ్చరించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక జంట‌గా న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నిన్న హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. “కొన్నాళ్ల క్రితం అర‌వింద్‌గారిని క‌లిసిన‌ప్పుడు సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడిగినపుడు ఆయన చాలా టెన్షన్ తో ఉన్నారు. ఏం జరిగింది అంటే కంటెంట్ మొత్తం బయటకు వెళ్లిపోయింది. దాదాపు గంట‌న్న‌ర సినిమా లీక్ అయింద‌ని చెప్పారు. “మీరేం వ‌ర్రీ కాకండీ. మా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా “అత్తారింటికి దారేది” కూడా ఇలాగే గంట‌న్న‌ర కంటెంట్ బ‌య‌టికి వెళ్లిపోయింది. దాని వ‌ల్ల స‌క్సెస్‌కి ఏమాత్రం ఆటంకం లేదు. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది అంత పెద్ద హిట్ అవుతుంది.

ఆ ర‌కంగా సెంటిమెంట్ అనుకోండి” అని ఆయనకు ఊరట కలిగించడానికి అన్నాను.” అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ “కోట్లు వెచ్చించి సినిమా చేసిన త‌ర్వాత ఆ కంటెంట్‌ని ఏదో కుర్ర‌త‌నంగానో, వేరే దురుద్దేశాలు ఉండో.. దాన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవ‌డం ఏం న్యాయం? ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు?” అని ప్రశ్నించారు. “ఇక్కడికి వచ్చిన అందరికీ త‌ల్లిలాగా అన్నంపెట్టే పరిశ్రమ ఇది. ఇక్క‌డ ప‌నిచేసే టెక్నీషియ‌న్స్ దాన్ని దొంగిలించి వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేయడం ద్రోహం చేయడమే. త‌ప్పు చేసిన వారు జైల్లో ఊచ‌లు లెక్క‌బెడుతున్నారు. ఇండ‌స్ట్రీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ హెచ్చ‌రిస్తున్నాను. కింది స్థాయి టెక్నీషియ‌న్స్ నుంచి ఎవ‌రైనా బాధ్య‌తా ర‌హితంగా ప్రవర్తిస్తే తల్లి పాలు తాగి రొమ్మును గుద్దిన‌ట్టేన‌ని అర్థం చేసుకోండి. ఇలాంటి చెడ్డ పనులకు పాల్పడవద్దు” అని చిరంజీవి సలహా ఇచ్చారు. చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి టీజర్ రేపు రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus