మెగాస్టార్ చిరంజీవి, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ.. ఈ సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటిపోయింది. 2024 డిసెంబరు మొదటి వారంలో ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా, యువ కథానాయకుడు నాని సమర్పకుడిగా ఈ సినిమాను ఘనంగా అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా ప్రకటన వచ్చినప్పుడే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేది కాదని తేలిపోయింది. ఎందుకంటే అప్పటికే శ్రీకాంత్ ఓదెల మరో సినిమా చేస్తున్నాడు కాబట్టి.
అయితే, ఆ అనౌన్స్‌మెంట్ తర్వాత సినిమా టీమ్ నుండి ఎలాంటి సమాచారం లేదు. సినిమా ఉందని, లేదని కూడా చెప్పలేదు. దర్శకుడు శ్రీకాంత్ ఓదలె నాని ‘ప్యారడైజ్’ సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా గురించి పట్టించుకోవడం లేదేమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. సినిమా పనులు జరుగుతున్నాయట. అవును ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరినే చెప్పుకొచ్చారు. తమ బ్యానర్‌లో రూపొందిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రచారంలో భాగంగా చిరంజీవి సినిమా గురించి సమాచారం ఇచ్చారు.
శ్రీకాంత్ ఓదెల- చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ‘ప్యారడైజ్’ సినిమా ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి అని చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది మధ్యలో చిరంజీవి సినిమా పనులు మొదలు పెడతాం అని కూడా చెప్పారు. అంటే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా విడుదల తర్వాత చిరంజీవికి కనీసం ఐదు నెలల గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్‌లో వేరే సినిమా చేస్తారా అంటే ఇంకా ఏదీ ఓకే చేయలేదు. ఆ లెక్కన గ్యాపే తీసుకుంటారు. అయితే ‘విశ్వంభర’ సినిమాను తొలుత చెప్పినట్లుగా సమ్మర్‌లో తీసుకొస్తే ఆ ప్రచారం పనుల్లో ఉంటారు. చూద్దాం మరి బాస్ ప్లాన్ ఎలా ఉందో?