చిరంజీవి ఊరమాస్ సినిమాలో చూసి చాలా రోజులైంది. సెకండర్ ఇన్నింగ్స్లో ఆ అవకాశం రాలేదు. అంతకుముందు కూడా పూర్తి మాస్ సినిమా చేసిన సందర్భం తక్కువే. ఆఖరిగా మాస్ సినిమా చేసింది అంటే… ‘అందరివాడు’ అనే చెప్పాలి. అయితే అప్పటి చిరంజీవి.. అంటే మాస్ చిరంజీవిని మరోసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు బాబి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో చిరంజీవితో బాబీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి లైనప్లో మార్పు జరుగుతుందని,
‘లూసిఫర్’ రీమేక్ తర్వాత బాబీ సినిమా వస్తుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే అది ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. బాబీ ఇటీవల చిరంజీవిని కలసి మంచి మాస్ మసాలా కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. చిరంజీవి ‘ఊ’ అనేసరికి ఇంకేముంది.. బాబీ జెట్ స్పీడ్లో పనులు చేస్తున్నాడట. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే ‘గ్యాంగ్ లీడర్’ స్టయిల్ కథను బాబీ సిద్ధం చేశాడట. చిరంజీవి సినిమాల్లో మాస్ కథలు అంటే చాలానే కనిపిస్తాయి.
వాటిలో చిరంజీవి అచ్చంగా ఒదిగిపోతారు కూడా. మరోవైపు బాబీ కూడా మాస్ కథల రాయడం, తీయడంలో దిట్ట. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మాస్ మూవీ పడితే ఆ కిక్ మామూలుగా ఉండదు. కరోనా సహకరించి… చిరంజీవి వరుసగా సినిమాలు చేసేసి, బాబీ సినిమా వచ్చేస్తే చూసేద్దా మరి. ఇంకెందుకు ఆలస్యం.