చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్ ని మాత్రమే కాదు భారతీయ సినిమా బాక్స్ ఆఫీస్ పైనే గురిపెట్టారు. భారతీయ సినీ రారాజు అమితాబ్ బచ్చన్ తో కలిసి రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కట్టుదిట్టమైన జాగ్రత్తలతో… శ్రద్ధ, శ్రమలతో “సైరా నరసింహారెడ్డి” సినిమాని చేస్తున్నారు. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా హోమానికి సంబంధించిన సన్నివేశాన్ని తెరకెక్కించారు. ఈ షూటింగ్ లో నయనతార, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు.
తాజాగా అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన కోయిలకుంట్ల ట్రెజరీ సెట్ లో చిత్రీకరణ సాగుతోంది. మరో వారం రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ తేదీ గురించి ఆసక్తికర న్యూస్ వచ్చింది. చిరంజీవికి కలిసొచ్చిన మే 9నే విడుదల చేయాలనీ తండ్రి కొడుకు ఆలోచిస్తున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మే 9 న “జగదేకవీరుడు అతిలోక సుందరి”, “గ్యాంగ్ లీడర్” విడుదలై సంచలన విజయం సాధించింది. అందుకే సైరా ప్రొడక్షన్ ని జనవరి నాటికి కంప్లీట్ చేసి.. తర్వాత నాలుగునెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయాలనీ భావిస్తున్నారు. అంతా సక్రమంగా జరిగితే వచ్చే వేసవిలో చిరు మూవీ థియేటర్ కి రావడం ఖాయం.