నాగార్జున వందో సినిమా.. ఈ టాపిక్ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న తంతు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమా చేస్తున్నప్పుడు నాగార్జున వందో సినిమా గురించి పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అదేంటో తర్వాత చూద్దాం కానీ.. ఇప్పుడు నాగ్ సినిమా దాదాపు పట్టాలెక్కడానికి రెడీగా ఉందట. మొన్నీమధ్య ఆయన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేస్తారనుకున్న సినిమా వివిధ కారణాల వల్ల చేయలేదు. అయితే ఇప్పుడు దసరా సందర్భంగా సినిమాను లాంఛనంగా ప్రారంభించాలని నాగ్ అనుకుంటున్నారట. దీని కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయట.
అక్కినేని నాగార్జున కెరీర్‌లో ల్యాండ్ మార్క్ 100వ సినిమాను తమిళ దర్శకుడు కార్తిక్ డైరక్షన్‌లో చేయాలని ఫిక్స్ అయ్యారు. మొన్నీ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు చెప్పేశారు కూడా. ఔట్ అండ్ ఔట్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కార్తిక్ ఈ కథను సిద్ధం చేశారని నాగ్ చెప్పారు. హోమ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాకు ‘100 నాటౌట్’ అనే టైటిల్‌ను వర్కింగ్ టైటిల్‌గా అనుకున్నారట. అదే మెయిన్ టైటిల్ అయ్యే అవకాశమూ ఉందట.
ఈ సినిమాను లాంఛ్ చేయడానికి నాగార్జున భారీ ప్లాన్స్ వేసుకున్నారట. ఇండస్ట్రీ హేమాహేమీలు, పెద్దలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యేలా ముందుగా అందరికీ ఇన్విటేషన్లు వెళ్తున్నాయట. చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చి సినిమా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టనుండగా, ఎన్టీఆర్ కూడా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇతర కుర్ర హీరోలు చాలామంది వస్తారు అని టాక్. నాగార్జునతో సినిమాలు చేసిన ప్రముఖ దర్శకులు కూడా ఈ కార్యక్రమానికి వస్తారట.
సినిమా ప్రారంభం రోజే కాస్ట్ అండ్ క్రూని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని సమాచారం. ఇందులో ఎవరూ ఊహించని పేర్లు చాలానే ఉంటాయని చెబుతున్నారు. అలాగే అక్కినేని కుటుంబ నటులు కూడా ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు అని ప్రాథమిక సమాచారం.