టాలీవుడ్ ని విషాదాలు వీడటం లేదు. 2026 లోకి అడుగుపెట్టాం..! అంతా బాగానే ఉంది అనుకునే లోపు ఓ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. టాలీవుడ్ కి చెందిన ఓ నటుడు ఆకస్మిక మరణం చెందారు. వివరాల్లోకి వెళితే… బ్యాంకింగ్ రంగ నిపుణుడు, సీనియర్ పాత్రికేయుడు అయినటువంటి సి. సురేష్ కుమార్(Suresh Kumar) అనారోగ్య సమస్యలతో నిన్న అంటే జనవరి 6న కన్నుమూశారు. దాదాపు 30 ఏళ్ళ నుండి ఆయన మల్టీనేషనల్ బ్యాంకులు అలాగే రెవెన్యూ శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేస్తూ వచ్చారు.
అయితే ఆయనకు నటనపై వ్యామోహం ఎక్కువ.కానీ ఆర్థికంగా స్థిరపడి, పేరు పలుకుబడి సంపాదించుకున్న తర్వాతే సినిమా రంగం వైపు దృష్టిపెడదామని అనుకున్నారు. రంగస్థల నటుడిగా ప్రాచుర్యం పొందినప్పటికీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎక్కువ టైం తీసుకున్నారు.
అమితాబ్ బచ్చన్ నటించిన ‘సర్కార్ రాజ్’ సినిమాతో ఈయన పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ‘మద్రాస్ కేఫ్’ ‘మోడ్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు.వెంకటేష్- మహేష్ బాబు కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్లో పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మహేష్ బాబుతో కలిసి ఓ సీన్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ‘గోల్కొండ హైస్కూల్’ ‘మహానటి’ వంటి క్రేజీ సినిమాల్లో కూడా ఆయన నటించారు.
సినిమాల్లోనే కాదు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా బలమైన పాత్రలు పోషించారు. ఆ రకంగా కూడా సినిమా పట్ల ఉన్న ప్యాషన్ ను చాటుకున్నారు. అలాంటి గొప్ప నటుడు మృతి చెందడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టు అయ్యింది.