Sanjay Leela Bhansali: ఆ స్టార్ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్ అసోసియేషన్
- June 27, 2026 / 12:33 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మీద కేసు నమోదు చేయండ అంటూ వర్కర్ల సంఘం కోరుతోంది. దానికి కారణం ఆయన రూపొందిస్తున్న ‘లవ్ అండ్ వార్’ అనే సినిమా సెట్‌లో ఇటీవల ఎలక్ట్రిక్ షాక్ తగిలి ఓ సినిమా కార్మికుడు మృతి చెందడమే. ఈ ఘటన నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Sanjay Leela Bhansali
ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఓ లేఖ కూడా రాసింది. ఈ ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కూడా అసోసియేషన్ తన లేఖలో కోరింది. ఇంతకీ ఏమైందంటే.. ముంబయిలో జరుగుతున్న ‘లవ్ అండ్ వార్’ షూటింగ్‌లో కార్పెంటర్‌గా పని చేస్తున్న చంద్రధారి సింగ్ యాదవ్ అనే వ్యక్తి విద్యుత్తు షాక్‌తో జూన్ 17న మృతి చెందారు. దీంతో చిత్ర పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది.
ఈ ప్రమాదం విషయమై వర్కర్ల సంఘం అధ్యక్షుడు సురేశ్ శ్యామ్‌లాల్ గుప్తా మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. అందులో ఆయన ‘లవ్ అండ్ వార్’ సెట్‌లో భద్రతా నిబంధనలు పాటించలేదు. గతంలోనూ భన్సాలీ సినిమా సెట్లలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. విచారణతో పాటు సెట్‌లో భద్రతా తనిఖీలు చేపట్టాలి. మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం, అతడి భార్యకు ఉద్యోగం లేదా ఆర్థిక సాయం ఇవ్వాలి. ఇద్దరు కుమార్తెలకు ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం అందించాలి అని కోరారు. అంతే కాకుండా భద్రతా నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు చెక్ చేసి తేల్చేవరకు షూటింగ్ నిలిపేయాలని కూడా కోరారు.
అయితే, భన్సాలీ ప్రొడక్షన్స్ ఇప్పటికే మృతుడి కుటుంబానికి రూ.40 లక్షల పరిహారం ప్రకటించింది. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ నటిస్తున్న సినిమా ఇది. వచ్చే ఏడాది జనవరి 21న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.















