ముఖ్యమంత్రి మెచ్చిన “మహానటి”

వైజయంతీ మూవీస్ పతాకంపై కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం “మహానటి”. నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రరాజాన్ని ప్రతి తెలుగు ప్రేక్షకుడు మెచ్చి అఖండ విజయాన్ని అందించాడు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవల వీక్షించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు (మే 26) అమరావతిలో ఓ ప్రత్యేకమైన అభినందన సభ నిర్వహించి మరీ “మహానటి” బృందాన్ని సత్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. “శ్రీమతి స్వప్నదత్, శ్రీమతి ప్రియాంక దత్ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తీసుకొని అఖండ విజయం సాధించారు. నాగఅశ్విన్ దాదాపు రెండేళ్లు ఈ సినిమా మీద వర్క్ చేయడం, ఎంతో మందితో డిస్కస్ చేసి అందరూ లీనమయ్యే స్థాయిలో సినిమా తీశాడు. రెండో సినిమాతోనే ఇంత అద్భుతమైన సినిమా తీయడం అనేది ప్రశంసార్హం. సావిత్రిగా కీర్తిసురేష్ అద్భుతంగా నటించారు. సావిత్రితో కలిసి కీర్తి సురేష్ జర్నీ చేసారేమో అనిపించేంతలా ఆమె ఈ చిత్రంలో బ్రహ్మాండంగా నటించారు. సావిత్రి గారి కుమార్తె కిజాయ చాముండేశ్వరి ఈ చిత్రం కోసం తనకు తెలిసిన ఇన్ఫో ఇవ్వడం మొత్తం ఇచ్చి సహకరించడం విశేషం. సాధారణంగా హీరోకి వర్షిప్పర్స్ ఉంటారు కానీ.. ఒక హీరోయిన్ కి వర్షిప్పింగ్ అనేది జరగడం కేవలం సావిత్రిగారికే చెల్లింది.

16 ఏళ్లకి సినిమాల్లోకి ఎంటరైన సావిత్రిగారు దాదాపు 30 ఏళ్లపాటు సినిమాలకే తన జీవితాన్ని అంకితం చేసి 46 ఏళ్లకి తుది శ్వాస విడిచారు. ఆమె మన రాజధాని అయిన అమరావతి పక్కనే ఉన్న చిన్న గ్రామంలో జన్మించడం అనేది సంతోషకరమైన విషయం. పల్లెటూర్లో పుట్టిన సావిత్రిగారు మహానటిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడం అనేది గర్వకారణం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆమె జీవితంలో సక్సెస్ ఫుల్ అవ్వడం అనేది స్పూర్తిదాయకం. అలాగే అద్భుతమైన నటి, అఖండమైన ఆత్మవిశ్వాసం, అంతులేని ఔదార్యం కలిగిన ఓ వ్యక్తి, మంచితనానికి మారుపేరు లాంటి మహానటి సావిత్రిగారి జీవితాన్ని ఆవిష్కరించడం అనేది చిన్న విషయం కాదు. ఈ చిత్రంతో అశ్వినీదత్ కుటుంబం ఓ చరిత్ర సృష్టించింది. అలాగే సినిమాలో నటించిన, సినిమాకి పనిచేసినవాళ్ళందరూ అభినందనీయులు. ముఖ్యంగా ఈ సినిమా కోసం 35 మంది మహిళలు వర్క్ చేయడం అనేది ప్రశంసనీయం. “మహానటి” ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. అందుకే మా పార్టీ సభ్యులందరికీ సినిమా చూడండి అని నేను కూడా ప్రమోట్ చేశాను. ఈ సినిమా చూసి అందరు స్పూర్తిపొందాలని ఆశిస్తున్నాను. ఈరోజుల్లోనే కాదు భవిష్యత్ లోనూ ఇలాంటి సినిమా రావడం అనేది చాలా కష్టం. అందుకే రాష్ట్రప్రజలందరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరుతున్నాను” అన్నారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. “ఏదో చిన్న రూమ్ లో మమ్మల్నందర్నీ కలిసి అభినందిస్తారేమో అనుకున్నాను కానీ.. ఈ స్థాయిలో పెద్ద సభ నిర్వహిస్తారని ఎక్స్ పెక్ట్ చేయలేదు. సావిత్రిగారు మనకు దొరికిన పెద్ద ట్రెజర్. ఆమె జీవితాన్ని ఆధారంగా తెరకెక్కించిన “మహానటి”లో నేను నటించడం అనేది నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన నా టీం మెంబర్స్ అందరికీ కృతజ్నతలు” అన్నారు.

సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి మాట్లాడుతూ.. “మన తెలుగు గడ్డ మీద మన తెలుగు సినిమాకి గర్వకారణమైన అమ్మ సావిత్రిగారి జీవితం ఆధారంగా చేసుకొని తెలుగు టెక్నీషియన్స్ అందరూ కలిసి “మహానటి” చిత్రాన్ని తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది. అమ్మ పుట్టిన గుంటూరులో అమ్మ సినిమాకి జరుగుతున్న సన్మానం ఇది. చాలా గర్వంగా ఉంది. ఇప్పట్నుంచి మా అమ్మని చూసుకోవాలి అనిపించినప్పుడల్లా కీర్తి సురేష్ ను చూసుకుంటే సరిపోతుంది” అన్నారు.

దర్శకుడు నాగఅశ్విన్ మాట్లాడుతూ.. “తెలుగువాళ్ళందరూ గర్వపడేలా ఈ చిత్రానికి మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. చంద్రబాబునాయుడు గారు నాకు ఎప్పట్నుంచో మంచి ఇన్స్పిరేషన్. ఏ విషయాన్నైనా “థింక్ బిగ్” అనేది ఆయన నుంచే నేర్చుకొన్నాను” అన్నారు.

మినిస్టర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. “సావిత్రిగారంటే తెలుగువాళ్లందరి అభిమాన నటి. అయితే.. ఈ జనరేషన్ కి సావిత్రి గారంటే ఎవరో తెలియదు. ఆ మహానటిని వైజయంతీ మూవీస్ నుంచి అశ్వినీదత్ గారు నేటి తరానికి పరిచయం చేశారు. మొన్నా మా కుటుంబంతో కలిసి హైద్రాబాద్ లో సినిమా చూస్తున్నప్పుడు కీర్తి సురేష్ ను చూస్తుంటే.. సావిత్రిగార్ని చూసినట్లే అనిపించింది. ఆమె మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకొంటున్నాను” అన్నారు.

నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ.. “మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు సాధారణంగా సినిమాల గురించి మాట్లాడరు, అటువంటి వ్యక్తి ఈమధ్య ప్రతి మీటింగ్ లోనూ “మహానటి” సినిమా గురించి మాట్లాడారు. విజయ చాముండేశ్వరి ఈ సినిమా మేకింగ్ కి సహకరించడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఎందరో ఆడవాళ్ళకి స్పూర్తిదాయకంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని రూపొందించిన టెక్నీషియన్స్ లో కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది ప్రశంసనీయం. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రిగార్ని కోరుతున్నాను” అన్నారు.

నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. “నేను అభిమానించే చంద్రబాబునాయుడుగారి ఆధ్వర్యంలో నేను నిర్మించిన “మహానటి” చిత్రం అభినంద సభ జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. నా 20వ ఏటనే ఎన్టీయార్ గారితో మా బ్యానర్ లో ఒక సినిమా రూపొందించి, ఆయన నా బ్యానర్ ని పేరు పెట్టడం అనేది ఇప్పటికీ గర్వపడుతుంటాను. నా ముగ్గురు బిడ్డలూ అమెరికాలో చదువుకొని ఫిలిమ్ మేకింగ్ వైపు వచ్చారు. సినిమా ఎలా తీస్తున్నారు అని చూడడం కోసం అప్పుడప్పుడూ వెళ్తూ ఉండేవాడ్ని. ముఖ్యంగా వాహిని స్టూడియోస్ ను ఏ విధంగా రీక్రియేట్ చేస్తున్నారో చూడడం చాలా ఆనందంగా అనిపించింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో అచ్చు సావిత్రిగారిలాగా కనిపించడం, నటించడం చూసి ఆ మహానటే స్వయంగా వచ్చి మా టీం అందర్నీ నడిపిస్తుందేమో అనిపించింది” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus