Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్ పెట్టుకోండన్న సీఎం
- September 23, 2026 / 01:42 PM ISTByFilmy Focus Desk
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ లాంటి సినిమా తర్వాత ఈ సినిమా వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో చిత్రబృందం సినిమాకు స్పెషల్ ప్రీమియర్ వేసుకోవడానికి అనుమతి తీసుకుంది. ఆ స్పెషల్ ప్రీమియర్‌ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్‌లో తన చూసేందుకు అనుమతి ఇవ్వాలని కథానాయకుడు నాని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కోరిన విషయం తెలిసిందే.
Nani
‘ఎక్స్’ వేదికగా నాని ఈ మేరకు విజ్ఞప్తి చేశాడు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న థియేటర్‌లో అభిమానులతో కలసి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీమియర్ షో చూసేందుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ‘‘భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు, తెలంగాణ బిడ్డ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై మీకున్న తపనకు అభినందనలు’’ అని సీఎం స్పందించారు.

ప్రీమియర్ షో సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సమూహాన్ని నియంత్రించేందుకు దయచేసి నిర్దేశిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారిక దరఖాస్తు చేసుకోండి అని సీఎం సూచించారు. సంబంధిత పోలీసు బృందం మీ దరఖాస్తును పరిశీలించి, దానికి అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటుంది అని సీఎం చెప్పారు. అలాగే ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి సీఎం సూచించారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని థియేటర్లలో సినిమా చూడటం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అంటూ నాని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రేక్షకుల కోసం తీసిన సినిమాను వారితో కలసి ఆస్వాదించాలనేది నా కోరిక. ప్రేక్షకుల స్పందనను ప్రత్యక్షంగా చూడటం నటుడిగా నాకు తృప్తినిస్తుంది అని నాని తన రిక్వెస్ట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అలాగే సెప్టెంబరు 23న స్పెషల్ ప్రీమియర్ వేసేందుకు కూడా ఓకే చెప్పాయి.














