నిన్నమొన్నటివరకూ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బయట కూడా ఒక టాక్ ఉండేది.. సినిమాలో స్టార్లు లేకపోతే సినిమాలు ఆడవు.. కలెక్షన్స్ రావు అని. ఆ సెంటిమెంట్ ను తమ సినిమాలతో బ్రేక్ చేస్తున్నారు నవతరం దర్శకులు. ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది శేఖర్ కమ్ముల అయినప్పటికీ.. అనీష్ కృష్ణ, వెంకటేష్ మహా, ఫణీంద్ర నర్సెట్టి లాంటి వాళ్ళు ఆ బ్యారియర్ ను బ్రేక్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన “మను, కంచరపాలెం” చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడమే కాక కలెక్షన్స్ పరంగానూ చిన్న సైజు సంచలనాలు సృష్టిస్తున్నాయి. “మను” సినిమా మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మింగుడుపడకపోయినా.. “బ్రిలియంట్ ఎఫర్ట్” అని అందరూ మెచ్చుకొంటున్నారు.
అయితే.. ఆదేరోజు విడుదలైన మరో చిత్రం “కేరాఫ్ కంచరపాలెం” మాత్రం వయోబేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటూ “విమర్శకులు మెచ్చిన సినిమాను ప్రేక్షకులు మెచ్చరు, స్టార్లు లేని సినిమాకు డబ్బు రాదు” లాంటి పాత సెంటిమెంట్స్ ను బ్రేక్ చేస్తోంది. రీజనల్ అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం బాక్సాఫీస్ వద్ద “కేరాఫ్ కంచరపాలెం” దూకుడికి ఆశ్చర్యపోతున్నారు. ఒక మీడియం బడ్జెట్ సినిమా స్థాయిలో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడంతోపాటు ఓ భారీ కమర్షియల్ సినిమా స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తుండడం విశేషం. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్న విధానం మరిన్ని చిన్న-కొత్త సినిమాలకు ఉతమిస్తుంది.