‘వెంకీ’ ‘దుబాయ్ శీను’ సినిమాల్లో బుజ్జి పాత్రని అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. హీరో గ్యాంగ్ లో ఈ పాత్ర కూడా ఒకటి. సపోర్టింగ్ రోల్ అనుకోవచ్చు.. ఆల్మోస్ట్ హీరో రోల్ అని కూడా అనుకోవచ్చు. ఈ 2 సినిమాల్లోనూ అతను బుజ్జి అనే పాత్రనే పోషించాడు.. 2 సినిమాల్లోనూ బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడు. వీటిలో మాత్రమే కాదు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఆనందం’ ‘సొంతం’ సినిమాల్లో కూడా హీరో ఫ్రెండ్ గ్యాంగ్లోనే కనిపిస్తాడు.
‘సొంతం’ సినిమాలో ఇతని ‘అన్నం తిన్న వెంటనే ఆకలి వేయడం లేదు’ ‘నాకు ఓటు వేసేంత వయసు రాలేదు’ అంటూ ఇతను అమాయకంగా పలికే డైలాగులు నవ్విస్తాయి. ఈ సినిమాల తర్వాత ‘లౌక్యం’ ‘కింగ్’ వంటి సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఇతని పేరు రామచంద్ర అని చాలా మందికి తెలీదు.
ఇతని ప్రస్తావన ఇప్పుడు ఎందుకు అంటే..? ఇటీవల రామచంద్రకి పక్షవాతం వచ్చిందట. ఇందులో భాగంగా అతని ఎడమ కాలు, ఎడమ చెయ్యి పూర్తిగా పడిపోయి.. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడట. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని బయటపెట్టాడు. రామచంద్ర మాట్లాడుతూ.. “15 రోజుల క్రితం నా ఫ్రెండ్ సినిమా డెమో షూట్ కోసం వెళ్ళాను. షూటింగ్లో పాల్గొంటున్న టైంలో.. సడన్ గా కాలు, చేయి నొప్పి కలిగింది. దీంతో ఇంటికి వచ్చేశాను. ఆ తర్వాత బీపీ పెరిగిపోవడం,పెరాలసిస్ ఎటాక్ అవ్వడం జరిగింది.అది నాకు ఆలస్యంగా తెలిసొచ్చింది.
మా ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ అయితే సిటీ స్కాన్ చేసి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యిందని తెలిపారు. ఆ తర్వాత ఎడమ కాలు, ఎడమ చేయి పడిపోయింది. 2 నెలలపాటు బెడ్ రెస్ట్ తీసుకోమని సూచించారు. అలాగే ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలని చెప్పారు. ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) మెంబర్ ని కాబట్టి.. కొంత అమౌంట్ సెటిల్ అయ్యింది. కానీ మిగతా ట్రీట్మెంట్ కి చాలా డబ్బులు కావాలి. ఎవరైనా సాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను.నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాతో పనిచేసిన నటీనటులు ఎవ్వరూ నాకు ఫోన్ చేసి అడిగింది లేదు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.