కరోనా – లాక్‌డౌన్… తెలుగు సినిమాకు ఆ మాటకొస్తే మొత్తం ఇండియన్ సినిమాకు చుక్కలు చూపించాయి. సగటు ప్రేక్షకులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ సినిమాలు వేద్దామన్నా జనాలు ఎక్కువమంది రాని పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి గురించి చర్చ ఎందుకు అంటే… మళ్లీ అలాంటి రోజులు ఏమన్నా వస్తాయేమో అనే డౌట్ రావడమే. కరోనా కొత్త ఉప జేఎన్.1 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. దీంతో సినిమాలు మళ్లీ ఆగుతాయా అనే డౌట్ వస్తోంది.
ఎందుకంటే బుధవారం ఒక్క రోజే 40 కొత్త జేఎన్.1 కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తంగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 529 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. టోటల్ కేసుల సంఖ్య అయితే 4,093కు చేరింది. ఇదంతా చూస్తుంటే మరికొద్ది రోజుల్లో ఈ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిస్తారేమో అనే డౌట్ వస్తోంది. అదే అయితే సంక్రాంతి సినిమాలకు ఇబ్బంది తప్పదు అని అంచనాలు వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంత పెద్దగా ఏమీ లేదు. అంకెల్లోనే రోజుకు నమోదవుతున్నాయి. అయితే రానున్నది పండగ సీజన్ కాబట్టి కేసుల సంఖ్య పెరుగుతుంది అని భావిస్తున్నారు. అదే జరిగితే మాత్రం సంక్రాంతికి బరిలో నిలిచిన ఐదు సినిమాలకు ముప్పు తప్పదు. ఇప్పటికే పొంగల్ ఫెస్టివల్‌కు ఓవర్ డోస్ అయిపోయింది అని తెలుస్తోంది. ఐదు సినిమాలు అంటే ఓవర్ డోసే కదా.
ఓవైపు మహేష్‌బాబు – త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaran) వస్తోంది. ఇంకోవైపు వెంకటేశ్ – శైలేష్ కొలను ‘సైంధవ్’ తీసుకొస్తున్నారు. మరోవైపు రవితేజ ‘ఈగల్’ రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున అయితే ‘నా సామి రంగా’ అంటూ రెడీ అయిపోయారు. ఇవి కాకుండా ప్రశాంత్ వర్మ – తేజ సజ్జా ‘హను – మాన్’ కూడా పొంగల్ ఫైట్‌లో ఉంది. ఇన్ని సినిమాలకు కరోనా ఎఫెక్ట్ తగిలితే ఇండస్ట్రీకి చాలా ఇబ్బంది అని చెప్పాలి.