పీవీఆర్ (PVR) ఐనాక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు సినిమాకు ముందు, ఇంటర్వెల్‌లో వరుస యాడ్స్ వేస్తూ ఉంటారు. మామూలు థియేటర్లలో వెయ్యరు అని కాదు కానీ.. పీవీఆర్‌లో ఎక్కువ వేస్తుంటారు. ఈ సమయంలో చాలామంది ‘ఇదేం బాధరా బాబూ.. ఇన్ని యాడ్సా?’ అని అనుకుంటూ ఉంటారు. మాకు తెలిసి మీరు కూడా ఏదో సందర్భంలో ఇలా అనుకునే ఉంటారు. మనం ఆ సమయానికి అనుకొని వదలేస్తే ఓ వ్యక్తి ఏకంగా ఈ విషయంలో వినియోగదారుల కమిషన్ మెట్లెక్కారు. ఇప్పుడు ఆ కేసు విషయంలో తీర్పు వచ్చింది.
తన సమయాన్ని వృథా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్, బుక్‌మై షో టికెట్ బుకింగ్ సర్వీసుపై ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం వినియోగదారుల కమిషన్‌లో దావా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్.. ఈ కేసులో దావా వేసిన వ్యక్తికి నష్టపరిహారం కింద రూ.65వేలు ఇవ్వాలంటూ తీర్పు చెప్పింది. అలాగే ఈ విషయంలో పీవీఆర్ ఐనాక్స్‌కు రూ.లక్ష జరిమానా కూడా విధించింది. 2023లో ఈ విషయంపై ఆ వ్యక్తి కమిషన్‌ను ఆశ్రయించారు.
బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 2023లో ఓ రోజు సాయంత్రం 4 గంటల షోకు పీవీఆర్ ఐనాక్స్‌లో సినిమాకు వెళ్లారు. అయితే సినిమా ప్రారంభించడానికి ముందు అరగంట సేపు యాడ్స్, ట్రైలర్లు ప్రసారం చేశారు. దీంతో 25 నిమిషాల సమయం వృథా అయిందని ఆ వ్యక్తి వినియోగదారుల కమిషన్‌కి ఇచ్చిన దావాలో పేర్కొన్నారు. ఆ ప్రకటనల వల్ల సినిమా అరగంట ఆలస్యంగా ప్రారంభమైందని, దీంతో సాయంత్రం 6 గంటలకు ముగియాల్సిన షో 6.30కి ముగిసిందని రాసుకొచ్చారు.
షో ఆలస్యం కారణంగా తన ప్లానింగ్ అంతా తారుమారు అయిందని, షెడ్యూళ్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఆ ప్రకటనల వల్ల ప్రేక్షకులకు కూడా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఈ విషయమై విచారణ జరిపిన వినియోగదారుల కమిషన్ సమయాన్ని డబ్బుగా పరిగణించాలని తీర్పులో పేర్కొంది. బుక్ మై షో టికెట్ కేవలం బుకింగ్ ప్లాట్‌ఫామ్ కాబట్టి సమయంపై దానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపింది. పీవీఆర్‌కు మాత్రమే జరిమానా పడింది.