ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథలంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తే. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజ్ ఈ తరహా కథలను మరింత స్టైలిష్‌గా, ఆసక్తికరంగా చూపించడంతో సిరీస్‌కు స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హిట్ 3 (HIT3) రూపంలో మరో పవర్‌ఫుల్ థ్రిల్లర్ రాబోతోంది. ఈసారి నేచురల్ స్టార్ నాని (Nani) కథానాయకుడిగా రంగంలోకి దిగాడు. ముందుగా విశ్వక్ సేన్ (Vishwak Sen) , ఆ తర్వాత అడివి శేష్ (Adivi Sesh) చేసిన పోలీస్ పాత్రలు ఇప్పటికే ఆకట్టుకోగా, ఇప్పుడు నాని ఏ స్థాయిలో ఈ క్యారెక్టర్‌ను నెరవేర్చుతాడనేది అందరిలో ఆసక్తి పెంచుతోంది.
అయితే, హిట్ 3లో మరో కొత్త ట్విస్ట్ రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, అడివి శేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నాని ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిట్ 3లో అడివి శేష్ పాత్రను మరో మలుపుగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అడివి శేష్ – నాని కలిసి కొత్త కేసును చేదిస్తారా లేదంటే కేవలం గెస్ట్ రోల్ తరహాలో ఉంటుందా అన్నది.. కాలమే సమాధానం ఇవ్వాలి.
దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదుగానీ, దర్శకుడు శైలేష్ (Sailesh Kolanu) ఈ పాత్రను చాలా బలంగా డిజైన్ చేశారని టాక్. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హిట్ 1, 2 కంటే ఎక్కువగా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. ఇది హిట్ ఫ్రాంచైజ్‌లో అత్యంత థ్రిల్లింగ్ మూవీగా నిలుస్తుందట. నాని నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే క్లైమాక్స్ దశకు చేరుకుంది. మే 1న విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.
ఇక నాని మరోవైపు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమా కూడా చేస్తున్నాడు. దసరా (Dasara) తర్వాత నాని నుంచి వస్తున్న ఈ సినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందట. ఓ కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీపై హైప్ బాగా ఉంది. హిట్ 3 కూడా విజయవంతమైతే, నాని రెండు వరుస బ్లాక్‌బస్టర్స్ అందుకునే అవకాశముంది. మొత్తానికి, హిట్ 3లో నాని అర్జున్ సర్కార్‌గా అదిరిపోయే యాక్షన్ చూపిస్తాడా అడివి శేష్ పాత్ర సినిమాలో ఎంతవరకు కీలకంగా ఉంటుందా అన్నది చూడాలి.