క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ సినిమాలు చూడటం అంటే మీకు ఆసక్తా? అయితే మీ కోసం ఓ సినిమా సజెషన్. మలయాళంలో విడుదలై భారీ విజయం అందుకున్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతోపాటు ప్రముఖ భాషలు అన్నింటిలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఏంటో తెలుసుకునే ముందు సినిమా విజయం గురించి తెలుసుకోవాలి. సుమారు రూ. 10 కోట్లతో రూపొందిన సినిమా రూ. 30 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక సినిమా పేరు ‘తలవాన్’ (Thalavan).
ఈ ఏడాది మే24న మలయాళంలో విడుదలైన ఈ సినిమాలో విలన్ బిజూ మేనన్ (Biju Menon) , ఆసిఫ్ అలీ (Asif Ali) ప్రధాన పాత్రధారులు. నిజ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. మియా జార్జ్ (Miya George), అనుశ్రీ హీరోయిన్లు. థియేటర్లలో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘తలవాన్’ (Thalavan) ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. నిజానికి సెప్టెంబర్ 10న స్ట్రీమింగ్ ఉంటుంది అని చెప్పిన టీమ్.. ఒక రోజు ముందుగానే సెప్టెంబర్ 9నే తీసుకొచ్చేసింది.
ఇద్దరు పోలీసు అధికారుల మధ్య గొడవలు, వారి ఈగో చుట్టూ సినిమా తిరుగుతుంది. ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్ (బిజు మీనన్) పని చేస్తున్న పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. కార్తిక్ దూకుడు మనస్తత్వం జయశంకర్‌కు నచ్చదు. ఆ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయిన మనుదాస్‌ను జయశంకర్ అనుమతి లేకుండా కార్తిక్ రిలీజ్ చేస్తాడు. దీంతో ఇద్దరికీ గొడవలు మొదలవుతాయి.
ఆ సమయంలోనే జయశంకర్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈ నేరంలో జయశంకర్ ఎలా ఇరుక్కున్నాడు? మర్డర్ కేసును విచారించే బాధ్యతను కార్తిక్ చేపట్టడానికి కారణం ఏమిటి? గొడవలను పక్కనపెట్టి జయశంకర్‌ను ఈ కేసు నుండి కార్తిక్ కాపాడాడా? లేదా? అన్నదే ఈ మూవీ (Thalavan) కథ. సినిమా సాగే కొద్దీ వచ్చే ట్విస్టులు థ్రిల్‌ను పంచడం అయితే పక్కా.