గురు దత్త క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అంగారిక వియాన్ జీ నిర్మిస్తున్న చిత్రం ‘దమయంతి’. నౌండ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో కౌశిక్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో చిత్ర ట్రైలర్‌ని కూడా విడుదల చేశారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ శ్రీనివాస్ నా దగ్గర స్క్రిప్ట్ రైటర్‌గా వర్క్ చేశాడు. ఈ సినిమాతో డైరెక్టర్‌గా మారాడు. మొదట నాకు దమయంతి సబ్జెక్ట్ చెప్పినప్పుడు భలే ఉందే అనిపించింది. 200 సంవత్సరాల కిందటి సబ్జెక్ట్‌ను ఇప్పటి సంవత్సరానికి లింక్ పెట్టి సినిమాను చేశారు. డిఫరెంట్‌గా అనిపించింది ఈ కాన్సెప్ట్. టీజర్, ట్రైలర్ బాగున్నాయి. కొన్ని మార్పులు కూడా చెప్పాను. హీరో కౌశిక్ జన్మదిన సందర్భంగా టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నాను..’’ అన్నారు.
డైరెక్టర్ నౌండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘శిష్యునిగా నన్ను ఆదరించినందుకు భరద్వాజ్ గారికి నా కృతఙ్ఞతలు. ఆయన దగ్గర శిష్యరికం చేశానని గర్వంగా చెప్పుకుంటాను. ఇక ఈ దమయంతి చిత్ర విషయానికి వస్తే.. కొన్నాళ్ల క్రితం కౌశిక్ ఓన్ బ్యానర్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ మొదలైంది. నల చక్రవర్తి భార్యనే దమయంతి. కానీ ఆ తరహా కథ కాదు. పొయెట్రిక్ స్పర్శతో పాటు థ్రిల్లర్ మిళితమై ఉంటుంది ఈ చిత్ర కధాంశం. ప్రాచీన సాహిత్యాన్ని కమర్షియల్ టచ్ ఇచ్చి సినిమా చేయాలనేదే నా కోరిక. నా టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ నా బలం వారిలో మొదటిగా నిర్మాత కౌశిక్. నాకు పెద్ద సపోర్ట్ కూడా అతనే. నన్ను పూర్తిగా నమ్మి స్వేచ్ఛనిచ్చి తానెంతో కష్టపడి సినిమా పూర్తి చేశాడు. ఈ రోజు కౌశిక్ పుట్టిన రోజు కావడంతో ఈ చిత్ర టీజర్‌ను, ట్రైలర్‌ను లాంచ్ చేయడం జరిగింది. ఇక మిగతా టీమ్ అందరూ ఎంతో సహకారాన్ని అందించారు కనుకే ఇక్కడి వరకు వచ్చిందీ చిత్రం. ఇందులో నటించిన వారందరికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కథే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాకు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను..’’ అని అన్నారు.
హీరో కౌశిక్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్‌ను నమ్మి సినిమా చేశాను. అతను నా నమ్మకాన్ని నిలబెట్టారు. చాలా బాగా వచ్చింది స్క్రిప్ట్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. క్రెడిట్ తనకే చెందుతుంది. తక్కువ బడ్జెట్‌లో సినిమా క్వాలిటీ ఉందంటే దానికి కారణం కెమెరామెన్ అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ముఖ్యంగా రెండు పాటలు అద్భుతంగా వచ్చాయి. నవంబర్ మధ్యలో ఆడియో విడుదల కార్యక్రమం ఉంటుంది. సినిమా అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు.
ప్రస్తుతం ‘దమయంతి’ చిత్రం షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ జరుపుకుంటోంది. నవంబర్ లేదా డిసెంబర్‌లో సినిమా విడుదల ఉంటుందని ఈ చిత్ర నిర్మాత గీతా కౌశిక్ తెలిపారు.