దర్శకుడు

  • August 5, 2017 / 03:02 AM IST

“కుమారి 21 ఎఫ్” అనంతరం సుకుమార్ నిర్మాణ సారధ్యంలో రూపొందిన చిత్రం “దర్శకుడు”. తనకు బంధువు మరియు తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అశోక్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ నిర్మించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఇషా కథానాయిక. సగటు యువకుడి ప్రేమను సినిమా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్రీకరించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : మహేష్ అలియాస్ ఆనంద్ ఉరఫ్ దర్శకుడు (అశోక్) చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి, అందరూ టికెట్ కొనుక్కొని కుర్చీలో కూర్చొని సినిమా చూస్తే.. అదే టికెట్ కొనుక్కొని ప్రొజెక్టర్ రూమ్ లో నిల్చోని సినిమాలు చూసేవాడు. తనకున్న సినిమా పిచ్చికి తండ్రి భరోసా తోడవ్వడంతో ఆ పిచ్చి కాస్త ఫ్యాషన్ గా మారి.. మోసం చేసి మరీ ఓ క్రేజీ యంగ్ హీరోతో సినిమా చేసే అవకాశాన్ని సంపాదిస్తాడు.

హీరోనైతే కన్విన్స్ చేయగలిగాడు కానీ.. ప్రొడ్యూసర్ మాత్రం “లవ్ ట్రాక్”తో సాట్టిస్ఫై అవ్వడు. దాంతో.. కొత్త ట్రాక్ రాసుకొని రమ్మని చెబుతాడు. సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియని మహేష్ తనకు దారిలో పరిచయమైన నమ్రత (ఇషా)తో జరిగే సంఘటనలనే సన్నివేశాలుగా తయారు చేసుకోవడం మొదలుపెడతాడు. తన స్వచ్చమైన ప్రేమను సినిమా సీన్ల కోసం మహేష్ వాడేయడం ఇష్టపడని నమ్రత అతడిని ప్రేమిస్తూనే దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. వృత్తిపరంగా కలిసి పనిచేయాల్సి వచ్చినా మానసికంగా నిబద్ధతతో ఉంటుంది.

ఒకానొక సందర్భంలో సినిమా ముఖ్యమా, నమ్రత ముఖ్యమా అనే విషయంలో సినిమాకే తన ఓటు వేసి.. తన ప్రేమను దూరం చేసుకొంటాడు. ఏమిటా సందర్భం, ఇంతకీ మహేష్ అంత ప్యాషనేట్ గా తీసిన సినిమా హిట్ అయ్యిందా లేదా? అనేది “దర్శకుడు” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు : సినిమాల్లో చాలా కాలం నుండి పనిచేస్తుండడం, నటీనటులకు సన్నివేశాలు ఎక్స్ ప్లైన్ చేయడం వంటివి అలవాటు ఉండడం వల్ల డైలాగ్ డెలివరీ వరకూ పర్వాలేదనిపించుకొన్న అశోక్.. హావభావాల ప్రకటనలో మాత్రం తేలిపోయాడు. డైలాగ్స్ చెబుతున్నంత ఈజీగా సదరు సన్నివేశంలోని ఎమోషన్ ను తన మొఖంలో పలికించలేకపోయాడు. మరో సినిమాకైనా ఈ విషయంలో బెటర్ మెంట్ సాధిస్తాడేమో చూడాలి. ఇషా ఈ చిత్రంలో పరిణితి చెందిన ప్రేమికురాలి పాత్రలో ఒదిగిపోయింది. ఎక్కడా అతి చేయక.. సన్నివేశానికి తగ్గట్లు ఎక్స్ ప్రెషన్ ఇస్తూ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. తెలుగమ్మాయి కావడంతో ఎక్కడా లిప్ సింక్ మిస్ అవ్వకుండా అటు అందం, ఇటు అభినయంతో అలరించింది.

పూజిత పొన్నాడ పాత్ర చిన్నదే అయినా.. ఉన్నంతలో పర్వాలేదనిపించుకొంది. జెమిని సురేష్, సుదర్శన్ లు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే బాధ్యతను తమపై వేసుకొని కొన్ని పంచ్ డైలాగ్స్ తో నవ్వించారు. “పెళ్ళిచూపులు” ఫేమ్ కేదార్ శంకర్ ప్రొడ్యూసర్ పాత్రలో హుందాగా నటించారు.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ ని ఫాలో అయిపోయి డప్పు మోతలతో థియేటర్లను హోరెట్టించి సాయికార్తీక్ తన పంధా మార్చుకొని మెలోడీ మ్యూజిక్ తోపాటు వినసోంపైన నేపధ్య సంగీతాన్ని సమకూర్చి సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవడం గమనార్హం. ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రఫీ బాగుంది. హీరోకి టైట్ క్లోజ్ లు పెట్టకుండా లాంగ్ షాట్స్ పెట్టి బానే మేనేజ్ చేశారు. ఇక సుకుమార్ ఎప్పట్లానే ఓపెనింగ్ టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకూ తనదైన రైటింగ్ స్కిల్స్ ను మరోమారు చూపించాడు. తాను దర్శకుడిగా పనిచేస్తున్నప్పుడు తనకు ఎదురైన అనుభవాలు, తన తోటి దర్శకులు ఎదుర్కొన్న పరిస్థితులు సినిమాలో యాడ్ చేశాడు. చిత్రసీమతో పరిచయం ఉన్నవారికి, సినిమాపై అవగాహన ఉన్నవారికి అవి అర్ధమైపోతాయి. అయితే.. సగటు సినిమా ప్రేక్షకుడు మాత్రం వాటికి కనెక్ట్ కాలేక ఇబ్బందిపడతాడు.

ఇక దర్శకుడు హరిప్రసాద్ సుకుమార్ తీసిన “100% లవ్, ఆర్య” ఫార్మాట్ తో “దర్శకుడు” సినిమాని చుట్టేస్తాడు. హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కు అప్డేటెడ్ వెర్షన్ లా ఉంటే.. హీరోయిన్ క్యారెక్టరేమో “100% లవ్”లో తమన్నా సెకండ్ షేడ్ ను తలపిస్తుంది. ఇక సినిమా డీలింగ్ మొత్తం “ఆర్య 2” ఫార్మాట్ లో సాగుతుంది. ఈ విధంగా సినిమా మొత్తం సుకుమారే కనిపిస్తాడు కానీ.. కొత్తదనం కాదు. సినిమాలో కామెడీ పండించడానికి విపరీతమైన స్కోప్ ఉంది, దాన్ని డైరెక్టర్ వాడుకోలేదు. పోనీ కేవలం కథపైన అయినా కాన్సన్ ట్రేట్ చేశాడా అంటే అదీ లేదు. సినిమాను ఎలా ముగించాలో అర్ధం కానీ సిట్యుయేషన్ లో “ఫ్యాషన్, తపస్సు” అంటూ ఒక అర్ధం కానీ లాజిక్ ను అర్ధవంతంగా చెప్పడానికి ప్రయత్నించి అర్ధాంతరంగా సినిమాకు తెరదించడం ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేసే విషయం.

విశ్లేషణ : “ఏం మాయ చేసావే”కి కామెడీ వెర్షన్ లాంటి సినిమా “దర్శకుడు”. అందులో ఎమోషన్ ఉంటుంది, ఇందులో ఉండదు అంతే తేడా. సో, సుకుమార్ మీద మమకారంతో “దర్శకుడు” సినిమాని ఓపిగ్గా చూడాలే తప్ప మరో ఆసక్తికర అంశం సినిమాలో కనిపించదు.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus