కన్నడ చిత్రసీమలో ఛాలెంజింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన దర్శన్ (Darshan) నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. అభిమాని హత్య కేసులో అరెస్టై జైలుకెళ్లిన ఆయన, ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ కేసు తర్వాత దర్శన్ కెరీర్ ఏమవుతుందనే సందేహాలు ఉన్నప్పటికీ, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. తాజాగా దర్శన్, ప్రేమ్ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుందని అధికారికంగా ప్రకటించారు.
గతంలో ‘కరియా’ (2003) వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శన్ – ప్రేమ్ కాంబో, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ కలవబోతోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా, పౌరాణిక జానపద కథతో భారీ స్థాయిలో తెరకెక్కనుందని టీజర్ ద్వారా హింట్ ఇచ్చారు. టీజర్‌లో ఒక గద్ద, హిందువులకు ప్రాముఖ్యమున్న పురాతన నగరాలు కనిపించాయి, వీటి ద్వారా సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
అలాగే, దర్శన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘D-59’ పై కూడా దృష్టి పెట్టారు. కాటేరా మూవీతో హిట్ అందుకున్న దర్శన్ – తరుణ్ సుధీర్ మరోసారి కలవబోతున్నారు. ది మీడియా హౌస్ స్టూడియో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘D-59’ అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా కూడా విశేషమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ కానుందని టాక్. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, ఇందులో దర్శన్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.
ఇక కేసు ప్రభావం పడుతుందా? లేదా? అన్నది పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. హత్య కేసులో విచారణ ఎదుర్కొంటూనే ఆయన తన సినిమాలను కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, దర్శన్‌కు కన్నడలో ఇప్పటికీ బలమైన ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన రీఎంట్రీ సినిమాలపై బజ్ నెలకొంది. అతనిపై ఉన్న నెగటివ్ ఇమేజ్‌ను తుడిచిపెట్టేయడానికి, ఈ రెండు సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో దర్శన్ రీఎంట్రీ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.