దాసరి ఆస్తుల గొడవలను పరిష్కరించేదెవరు ?
- September 11, 2018 / 10:46 AM ISTByFilmy Focus
కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను తెలుగు చిత్ర పరిశ్రమకి ఎక్కువ పరిచయం చేసిన వారిలో దాసరి నారాయణరావు పేరు ముందు వినిపిస్తుంది. అంతేకాదు పరిశ్రమలోని ఏ క్రాఫ్ట్ లో గొడవలు వచ్చినా.. పెద్ద మనిషిగా ఉండి పరిష్కరించేవారు. అంతటి గొప్ప వ్యక్తి తన కుటుంబసభ్యులు గొడవలతో రోడ్డు మీదకు వస్తారని ఊహించలేకపోయారు. అనారోగ్యంతో దాసరి మరణించడంతో అతని ఆస్తుల గొడవ బయటికి వచ్చింది. దాసరికి ఇద్దరు కొడుకులు ప్రభు, అరుణ్ . పెద్దబ్బాయి ప్రభు సతీమణి సుశీల కొడుకుతో సహా ఆయన స్వగృహం ముందు బైఠాయించి ఆస్తుల పంపకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ ధర్నాకు దిగారు. దాసరి గారు బ్రతికిఉన్నప్పడే తమకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారని కానీ అతని మరణంతో తమను ఆదుకునే వారు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
ఆస్తులన్నీ రెండో అబ్బాయి దాసరి అరుణ్ కుమార్ ఆధీనంలో ఉండటం వల్ల వాటాల పంపిణి జరగలేదని సుశీల ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చట్టప్రకారం ముందుకు వెళ్లే దిశగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన పరిశ్రమలో చాలా మంది బాధపడుతున్నారు. ఎన్నో సమస్యలను పరిష్కరించిన పెద్దాయన కుటుంబమే ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలోని పెద్దలు ఈ విషయంలో కల్పించుకొని దాసరి కొడుకులిద్దరికీ న్యాయం చేయాలనీ కోరుతున్నారు.













