సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వెనుక ఉద్దేశం.. రాసిన అంశం వేరయా.. రెండింటిని లింక్ చేస్తే అసలు విసయం బోధపడుతుంది అని అంటుంటారు టాలీవుడ్‌లో. ఆ మాటకొస్తే నిజ జీవితంలోనూ ఇలానే ఉంది అనుకోండి. ఆ లెక్కన బాలీవుడ్‌లో కూడా ఇదే పరస్థితి. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? గత కొన్ని రోజులు ఇటు వైజయంతి మూవీస్, దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోయిన్ దీపిక పడుకొణె మధ్య జరుగుతున్న సోషల్ మీడియా పోస్టుల వార్. తాజాగా దీపిక పెట్టిన పోస్టు మీరు చూశారా?
‘కల్కి 2’ సినిమా నుండి దీపిక పడుకొణె తప్పుకుందా, లేక తప్పించారా అనేది తేలలేదు కానీ. నిబద్ధత విషయంలో వచ్చిన ప్రశ్నలు, చర్చలే ఆమె సినిమాలో లేకపోవడానికి కారణం అని సమాచారం. అదేంటి అనేది ఆమెనో లేక వైజయంతి మూవీస్ టీమ్ ఓపెన్ అయితే కానీ తెలియదు. అంతకుముందు ఇలాంటి విషయాల మధ్యనే ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’లో ఆమె భాగం కాకుండా పోయింది. ఈ విషయం వదిలేస్తే.. ఇప్పుడు దీపిక చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
‘‘18 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు షారుఖ్ ఖాన్ నాకు కొన్ని పాఠాలు నేర్పారు. సినిమాతో మనం ఏం నేర్చుకున్నాం, అందులో ఎవరితో నటిస్తున్నాం అనే విషయాలు ఆ సినిమా విజయం కంటే ప్రాధాన్యమైనవి. ఆ మాటలను నేను పూర్తిగా నమ్మాను, ఇప్పటికే నమ్ముతాను. అందుకే అప్పటి నుండి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆ పాఠాన్నే అమలు చేస్తున్నాను’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్‌తో ఆరో సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది.
షారుఖ్ ఖాన్ – సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో ‘కింగ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులోనే దీపిక కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసమే ‘కల్కి 2’, ‘స్పిరిట్’ సినిమాల నుండి తప్పుకుంది అనే కొత్త వాదన బయటకు వచ్చింది. మరి ఇందులో ఏది నిజమో ఆమెనే చెప్పాలి.