బయోపిక్‌లు ఎప్పుడూ భయపెట్టేవే. ఎందుకంటే ఆ వ్యక్తుల జీవితాల్ని యథాతథంగా చూపిస్తే ఆయన అభిమానులకు నచ్చకపోవచ్చు. ఉన్నది ఉన్నట్లు చూపించకపోతే ప్రత్యర్థి అభిమానులకు, సగటు ప్రేక్షకులకు నచ్చదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు జీవితాలను సినిమాగా మార్చినప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా చేస్తేనే ఆ సినిమా కానీ, సిరీస్ కానీ రాణిస్తుంది. గతంలో ఓ అగ్రనాయకుడు జీవితాన్ని తెరకెక్కించినప్పుడు ఈ థిన్ లైన్ మరచిపోయి నచ్చినట్లు సినిమాలు తీసేసి ఇబ్బంది పడ్డారు.
అయితే, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు దేవా కట్టా ఈ అంశాన్ని భలేగా హ్యాండిల్ చేశారు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. తెలుగు నేలపై అగ్ర రాజకీయ నాయకులు అనిపించిన ఒక దివంగత మాజీ సీఎం, ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ పొలిటీషియన్ జీవితాల్ని ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదే ‘మయసభ’. ఇటీవల స్ట్రీమింగ్ ప్రారంభించుకున్న ఈ వెబ్‌సిరీస్ చూశాక.. ఇద్దరు స్టార్ హీరోలకు సమానమైన స్క్రీన్ స్పేస్, ఇంపార్టెన్స్ ఇచ్చేలా ఈ సిరీస్ రూపొందింది అనే మెచ్చుకోలు అందుకుంటున్నారాయన.
కాకర్ల కృష్ణమనాయుడు (కేకేఎన్), ఎంఎస్ రామిరెడ్డి (ఎంఎస్‌ఆర్) రాజకీయ పయనం ఎలా సాగింది? ప్రజలకు మేలు చేయడానికి వీరిద్దరూ కలసి ఆడిన రాజకీయ చదరంగం ఏంటి? అనే అంశాలను స్పృశిస్తూ చక్కగా కథను అల్లుకున్నారు. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడం, ఒక్కోసారి ఇద్దరూ ఒకేలా ఆలోచించడం లాంటి సన్నివేశాలు పెట్టి ఎక్కడా ఏ రాజకీయ నాయకుడి అభిమానులు మనసు నొచ్చుకోకుండా చూసుకున్నారు. మేకింగ్, టేకింగ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా వివాదాలు వచ్చే అవకాశం ఉన్నచోట బాగా ఆలోచించి ఘనుడే అనిపించుకున్నారు దేవా కట్టా.
అయితే, అసలు సమస్య ఇప్పుడే రానుంది. దేవా కట్టా చూపించిన ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకుల తర్వాత రాజకీయ ప్రయాణంలో చాలా విపరీత మార్పులు వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇది తెలియాలంటే ‘మయసభ 2’ రావాలి. ఇప్పుడు ఆయన అదే పనిలో ఉన్నారట.