దివంగత నటీమణి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ కథానాయికగా పరిచయమవుతూ నటించిన చిత్రం “ధడక్”. 2016లో చిన్న చిత్రంగా విడుదలై 100 కోట్ల రూపాయలు వసూలు చేసి భారతీయ చిత్రపరిశ్రమకు షాక్ కు గురిచేసిన మరాఠీ చిత్రం “సైరత్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం నేడు (జూలై 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఒరిజినల్ వెర్షన్ అయిన “సైరత్” రేంజ్ లో “ధడక్” ఆకట్టుకోగలిగిందా? నటిగా జాహ్నవి కపూర్ తల్లి శ్రీదేవి పేరు నిలబెట్టగలిగిందా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి.
కథ : ఉదయ్ పూర్ లోని అగ్రవర్ణానికి చెందిన రతన్ సింగ్ (అశుతోష్ రాణా) చిన్నారి కుమార్తె పార్ధవి (జాహ్నవి కపూర్) చిన్నప్పట్నుంచి ధైర్యం, తెగింపు ఎక్కువగా ఉన్న పెంకి పిల్ల. అదే ఊర్లోని తక్కువజాతి కుర్రాడైన మధుకర్ (ఇషాన్)ను ప్రేమిస్తుంది. వారి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లడానికి కులం అడ్డురావడంతో మధుకర్ ను ఎక్కడ చంపేస్తారో అన్న భయంతో అతడ్ని తీసుకొని ముంబై ట్రైన్ ఎక్కేస్తుంది పార్ధవి.
ముంబై నుంచి నాగ్ పూర్ వెళ్ళిన మధుకర్-పార్హవి జంట అక్కడ ఉండడం సురక్షితం కాదని భావించి కలకత్తా వెళ్లిపోతారు. అక్కడ ఇద్దరూ కలిసి ఉద్యోగం చేసుకొంటూ తమ జీవితాల్ని నెట్టుకొస్తున్న తరుణంలో.. పార్ధవి కుటుంబ సభ్యులు మళ్ళీ వారి జీవితాల్లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత పార్ధవి జీవితం ఎటువంటి మలుపు తిరిగింది? అనేది “ధడక్” కథాంశం.
నటీనటుల పనితీరు : “బియాండ్ ది క్లౌడ్స్” అనంతరం “ధడక్”తో మరోమారు నటుడిగా తనని తాను నిరూపించుకొన్నాడు ఇషాన్. మధుకర్ పాత్రలో తుంటరి కుర్రాడిగా, బాధ్యతగల ప్రేమికుడిగా, భర్తగా అద్భుతంగా అలరించాడు.
శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ డెబ్యూ మూవీ కాబట్టి పర్లేదు అనిపించింది. అయితే.. అమ్మడు టైట్ క్లోజ్ షాట్స్ ను ఎవాయిడ్ చేయాలి. ముఖం పెద్దది కావడంతో చాలా సన్నివేశాల్లో హీరో కంటే పెద్దమ్మాయిగా కనిపించింది. అలాగే.. హావభావాల ప్రదర్శనలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. అశుతోష్ రాణాను సరిగా వినియోగించుకోలేదు. అలాగే.. మిగతా పాత్రధారులను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.
సాంకేతికవర్గం పనితీరు : మామూలు రీమేక్ సినిమాలనే ఒరిజినల్ చూసిన ప్రేక్షకులు ఫ్రేమ్ టు ఫ్రేమ్ కంపేర్ చేస్తారు. అలాంటిది సెన్సేషనల్ హిట్ కొట్టిన “సైరత్” అంటే కంపేర్ చేయకుండా ఉంటారా.. అలా కంపేర్ చేసినవాళ్ళని ఈ సినిమా నిరాశపరుస్తుంది. ఒరిజినల్ వెర్షన్ లో హీరోయిన్ క్యారెక్టర్ ను అందరూ ఓన్ చేసుకోవడానికి రీజన్ అమ్మాయి పెర్ఫార్మెన్స్ & యాటిట్యూడ్. వాటిని “ధడక్”లో రీక్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్ శశాంక్. అలాగే.. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులందర్నీ ఒక్కసారిగా షాక్ గురి చేసిన “సైరత్” క్లైమాక్స్ ను మార్చడం పెద్ద తప్పేనని చెప్పాలి. అలాగే.. ఒరిజినల్ వెర్షన్ లో పెయిన్, స్ట్రగుల్ ఎక్కువగా ఉంటాయి. అందుకే యూత్ ఆ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. కానీ.. చిత్రాన్ని లావిష్ గా తీయడం కోసం చేసిన మార్పులు సినిమాలో ప్రేక్షకుడ్ని ఇన్వాల్వ్ చేయలేవు. ముఖ్యంగా.. “పరువు హత్య” నేపధ్యంలో తెరకెక్కిన చిత్రాన్ని “పగ హత్య”గా మార్చేయడంతో సినిమాలో ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మిస్ అవ్వడమే కాక.. కథాగమనం కూడా పూర్తిగా మారిపోయింది. ఆ కారణంగా “సైరత్” స్థాయి విజయాన్ని “ధడక్” అందుకోవడం అనేది అసాధ్యం.
అయితే.. ఒరిజినల్ వెర్షన్ చూడని వారిని మాత్రం ఓ మోస్తరుగా ఆకట్టుకొంటుందీ చిత్రం. సో, డైరెక్టర్ గా శశాంక్ కైతాన్ బొటాబోటి మార్కులతో పాస్ అయ్యాడు. అజయ్-అతుల్ అందించిన బాణీలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ బాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా ఉన్నాయి. అయితే.. సినిమాలో సహజత్వం మిస్ అయ్యింది. కమర్షియల్ ఫార్మాట్ లోనే ఈ స్వచ్ఛమైన ప్రేమకథ కూడా సాగడం అనేది ఒన్నాఫ్ ది మైనస్.
ఓవరాల్ గా.. శ్రీదేవి మీద గౌరవంతో ఆమె కుమార్తె నటించిన సినిమా కాబట్టి “ధడక్” చిత్రాన్ని చూడ్డానికి వచ్చే ప్రేక్షకులని ఓ మోస్తరుగా అలరించే చిత్రమిది. అయితే.. ‘సైరత్”తో కంపేర్ చేస్తే మాత్రం అందరికీ నచ్చదీ చిత్రం.
విశ్లేషణ : సినిమాలో స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా లేదా? సినిమా ఎంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది అనేది ప్రేక్షకులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. ఇప్పుడు మనసుల్ని హత్తుకొనే కథాంశాలు మాత్రమే ఆకట్టుకొంటున్నాయి. అందుకే దర్శకులు తీసే సినిమాలు అయితే ఇన్వాల్వ్ చేయాలి లేదా ఎంటర్ టైన్ చేయాలి. అంతే కానీ.. ఏదో ఉంది అన్నట్లుగా తీస్తే మాత్రం కష్టం.