కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush) ఇప్పుడు తన కెరీర్‌లో కొత్త దశకు అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ నటుడు ఇప్పుడు బయోపిక్‌ల పట్ల ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో కథానాయకుడిగా నటించేందుకు రంగం సిద్ధం చేసిన ధనుష్, తాజాగా మరో డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కూడా బయటపెట్టాడు. ఇళయరాజా పాత్ర చేయడం తన చిరకాల కోరిక అని చెప్పిన ధనుష్, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బయోపిక్‌లో కూడా నటించాలన్న ఆకాంక్షను వెలిబుచ్చాడు.
“రజనీ సర్ జీవితం నుంచి నేర్చుకోవలసిన అంశాలు ఎంతో ఉన్నాయి. ఆయనపై సినిమా వస్తే, అందులో భాగం కావాలని చాలాకాలంగా కలలు కంటున్నా,” అని ఓ ఇంటర్వ్యూలో ధనుష్ చెప్పడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్‌కి రజనీతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ఒకప్పటి హీరో స్పూర్తిగా మారిన రజనీకాంత్ ఆ తరువాత ధనుష్‌కు మామయ్య కూడా అయ్యాడు. అయితే ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya) మధ్య విడాకులు వచ్చినా, ధనుష్ రజనీపై అభిమానాన్ని ఎప్పటికీ కోల్పోలేదు.
అతడి జీవితం తనకు మార్గదర్శకమని ఇప్పటికీ ధనుష్ చెప్పడం ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఇప్పటికే బాలీవుడ్‌లో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, ఇళయరాజా బయోపిక్ తర్వాత మరో బంధాన్ని, మరో స్పూర్తినాయకుడిని తెరపై చూపించాలనుకోవడం వల్లే రజనీకాంత్ బయోపిక్ వైపు ఫోకస్ పెట్టాడు.
ఇది పూర్తవుతుందా లేదా అనేది తేలాల్సి ఉన్నా, ధనుష్ మాత్రం ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ పరిణామాలతో కోలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా ధనుష్ తీయబోయే తదుపరి అడుగులు ఎంతో ఆసక్తిగా మారాయి. జస్ట్ ఓ నటుడిగా కాకుండా, భారతీయ కళాకారుడిగా తన స్థాయిని మరింత పెంచే దిశగా ధనుష్ సాగుతున్నాడనడంలో సందేహం లేదు.