టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో, అక్కినేని వంశాంకురం అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ సెగలు పుట్టిస్తోంది. అవును, కింగ్ నాగార్జున (Nagarjuna) ముద్దుల తనయుడి వివాహ ముహూర్తం దాదాపు ఖరారైనట్లేనని ఇన్‌సైడ్ టాక్ జోరుగా షికార్లు చేస్తోంది. ఆ శుభ ఘడియ జూన్ 6వ తేదీ అని తెలుస్తుండటంతో, అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైనట్టేనని అనుకుంటున్నారు. గతేడాది నవంబర్ 26న, ప్రముఖ వ్యాపార దిగ్గజం జుల్ఫీ రావ్‌జీ కుమార్తె, అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన కళాకారిణి జైనబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం ఎంత ఘనంగా జరిగిందో మనందరికీ తెలిసిందే.
భారతదేశం, దుబాయ్, లండన్ వంటి నగరాల్లో తనదైన ముద్ర వేసిన జైనబ్, తన సృజనాత్మకతతో, సాంస్కృతిక పరిజ్ఞానంతో అక్కినేని కుటుంబానికి ఒక అపురూపమైన కానుకగా మారారు. కొన్నేళ్ల పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు ఏడడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ జంటను చూసి అందరూ మురిసిపోతున్నారు. ఆ సమయంలో కింగ్ నాగార్జున, తనయుడు అఖిల్ జీవిత భాగస్వామిగా జైనబ్‌ను ఎంచుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని అందించిందని ఉప్పొంగిపోయారు.
ఆయన మాటల్లోనే జైనబ్ అంటే అక్కినేని కుటుంబానికి ఎంత ఇష్టమో స్పష్టంగా తెలిసిపోయింది.ప్రస్తుతం అఖిల్, విలక్షణ దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు (Murali Kishore Abburu) డైరెక్షన్‌లో ‘లెనిన్’ (Lenin) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఒక పవర్-ప్యాక్డ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఈ పెళ్లి వార్తపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నా, జూన్ 6న జరిగే ఈ వేడుక కోసం అభిమానులు, సినీ ప్రముఖులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.