తమిళనాట మరో వారసుడు సినిమాల్లోకి రాబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ స్టార్ హీరో సన్ సినిమా అనౌన్స్ చేసేస్తారు. పేరుకే తమిళ హీరో వారసుడే అయినా తెలుగులో కూడా ఆ హీరోకు పేరున్న నేపథ్యంలో.. వారసుడు కూడా తెలుగులోకి రాబోతున్నాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వారసుడి సినిమాను ఆయన తండ్రే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక్కడ తండ్రి ప్రముఖ హీరో ధనుష్ కాగా.. ఆయన పెద్ద కొడుకు యాత్ర ఇప్పుడు ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఈ మేరకు తమిళ సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సినిమాను ఆర్‌టేక్ స్టూడియోస్, ధనుష్ సొంత సంస్థ వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తాయట. యాత్ర ప్రస్తుతం నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా కోసం టెస్ట్ షూట్ కూడా చేస్తారట. అందులో ఓకే అనుకున్న లుక్‌తో తమిళనాట పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అనుకుంటున్నారట. అంటే కొత్త హీరో రాబోతున్నాడు అనే యాంగిల్‌లో ప్రచారం చేస్తారని టాక్.
ఈ నేపథ్యంలో ధనుష్ తన సినిమాను త్వరత్వరగా పూర్తి చేసుకొని.. కొడుకు సినిమా మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నాడట. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తారట. సినిమాను అనౌన్స్ చేసేటప్పుడు మరిన్ని వివరాలు వెల్లడిస్తారట. యాత్ర లుక్స్ విషయంలో ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి వైబ్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమాను ధనుషే తెరకెక్కిస్తాడని వార్త రావడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఎలాంటి కథతో వస్తారో చూడాలి.
ధనుష్ ఇప్పటివరకు నాలుగు సినిమాలను డైరెక్ట్ చేశాడు. ‘పా పాండీ’, ‘రాయన్’, ‘నిలవుకు ఎన్ ఎన్నాడి కోబమ్’, ‘ఇడ్లీ కడాయి’ సినిమాలను తెరకెక్కించాడు. ఇక నిర్మాతగా చాలా సినిమాలు తెరకెక్కించారు. మరి కొడుకు సినిమాను కేవలం డైరెక్ట్ చేస్తాడా? లేక ఓ పాత్ర కూడా పోషిస్తారా అనేది చూడాలి.