స్టార్ క్రికెటర్ .., ఇండియా వైడ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన మహేంద్ర సింగ్ ధోని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన నిర్మాతగా మారి.. ‘ధోనీ ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఓ బ్యానర్ ను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘LGM ‘ (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే తమిళ సినిమాను నిర్మించారు. ఇందులో ‘జెర్సీ’ ఫేమ్ హరీష్ కళ్యాణ్, ఇవానా (‘లవ్ టుడే’ ఫేమ్) హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. నదియా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.
యోగిబాబు, మిర్చి విజయ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమేష్ తమిళమణి దర్శకుడు. జూలై 28 న ఈ చిత్రం తమిళంలో రిలీజ్ కాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో అదే రోజున ‘బ్రో’ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి.. ‘LGM ‘ చిత్రాన్ని ఆగస్టు 4 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు టీం హైదరాబాద్ రావడం జరిగింది. ఇందులో భాగంగా ధోని భార్య అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
సాక్షి (Sakshi Dhoni) మాట్లాడుతూ.. “నేను అల్లు అర్జున్ సినిమాలన్నీ చూశాను.నేను అతనికి పెద్ద అభిమానిని. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటివి లేని టైంలోనే యూట్యూబ్‌లో ‘గోల్డ్‌మైన్ ప్రొడక్షన్’ ఛానెల్లో డబ్ అయిన అల్లు అర్జున్ సినిమాలన్నీ నేను చూడటం జరిగింది. ఇప్పటికైతే కాదు కానీ అల్లు అర్జున్ తో సినిమా చేసే రేంజ్ కి మా బ్యానర్ ను డెవలప్ చేసుకోవాలని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.