Dhurandhar : భారతీయ సినిమాలు ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తమ సత్తాను చాటుతున్నాయి. భాష ఏదైనా సరే, మన చిత్రాలు విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే భారతీయ సినిమాలు పాకిస్తాన్‌లో అధికారికంగా విడుదల కావడం లేదు. బాలీవుడ్ చిత్రాలపై అక్కడ నిషేధం ఉన్నప్పటికీ, ప్రేక్షకుల ఆసక్తి మాత్రం తగ్గలేదు. థియేటర్లలో విడుదల కాకపోయినా, పైరసీ ద్వారా భారత సినిమాలు అక్కడ విపరీతంగా చూస్తారు పాకిస్తాన్ ఆడియన్స్.
ఇటీవల ఈ జాబితాలో సంచలనంగా నిలిచింది రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్లింది. బాక్సాఫీస్ వద్ద రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ, తక్కువ సమయంలోనే భారీ వసూళ్లను సాధించింది. రెండు వారాల్లోనే 500 వందల కోట్ల మార్క్‌ను దాటుతూ సరికొత్త సెన్సేషన్‌గా మారింది. పాకిస్తాన్‌తో పాటు కొన్ని గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల కాకపోయినా, అక్కడి ప్రేక్షకులు మాత్రం ‘ధురంధర్’పై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్ అవకాశం లేకపోవడంతో, పైరేటెడ్ వెబ్‌సైట్ల ద్వారా ఈ చిత్రాన్ని భారీ సంఖ్యలో డౌన్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, రోజుల వ్యవధిలో 3.3 మిలియన్స్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయి అని టాక్.
దీంతో ‘ధురంధర్’ పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీ అయిన భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకుముందు షారుక్ ఖాన్ సినిమాలు ఈ జాబితాలో ముందుండగా, తాజా రికార్డులతో రణ్వీర్ సింగ్ చిత్రం వాటిని అధిగమించినట్టు టాక్. థియేటర్లలోనూ, ఆన్‌లైన్ చర్చల్లోనూ ‘ధురంధర్’ పేరు మార్మోగుతుండటంతో, ఈ సినిమా ప్రభావం బలంగా ఉందో మరోసారి రుజువైంది.