‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

‘90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ (90’s – A Middle-Class Biopic) వెబ్ సిరీస్‌తో దర్శకుడు ఆదిత్య హాసన్ (Aditya Haasan) సంచలన విజయం సాధించాడు. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్, నటుడు శివాజీకి (Sivaji) సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ విజయంతో ఆదిత్య హాసన్ దర్శకుడిగా టాలీవుడ్‌లో తన సత్తా చాటుకున్నాడు. అంతేకాక, ‘ప్రేమలు’(Premalu) తెలుగు వెర్షన్‌కు మాటలు అందించిన ఆదిత్య, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మరింత పేరు తెచ్చుకున్నాడు. ఈ విజయాలతో ఆదిత్యకు పలువురు హీరోల నుంచి ఆఫర్లు వచ్చాయి, అందులో నితిన్ (Nithiin) కూడా ఒకరని సమాచారం.

Aditya Haasan

‘90’s’ సిరీస్ క్రేజ్‌తో నితిన్, ఆదిత్య హాసన్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపాడని, మంచి కథతో వస్తే కమిట్ అవుతానని చెప్పినట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపించింది. అయితే, నెలలు గడిచినా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man)  డిజాస్టర్‌గా నిలిచి నిరాశపరిచింది, వెంకీ కుడుములతో  (Venky Kudumula)  చేసిన ‘రాబిన్ హుడ్’ (Robinhood)  సినిమా సగంలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ‘తమ్ముడు’ (Thammudu) సినిమాతో బిజీగా ఉన్న నితిన్ , ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది.

‘తమ్ముడు’ తర్వాత నితిన్ ఆదిత్య హాసన్‌తో సినిమా చేస్తాడని అంతా భావించారు, కానీ సీన్ మారింది. నితిన్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో, ఆదిత్య హాసన్ మరో హీరోతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఖరారు చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా, ఆదిత్య హాసన్ సినిమా హైదరాబాద్‌లో ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా కూడా ఫీల్‌గుడ్ ఎలిమెంట్స్‌తో, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. నితిన్ గతంలో కొంతమంది దర్శకులతో సినిమా చేస్తానని చెప్పి, నెలల తరబడి వేచి చూసేలా చేసి, చివరకు వేరే దర్శకులతో సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఆదిత్య హాసన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని, తెలివిగా వ్యవహరించి ఆనంద్ దేవరకొండతో సినిమా ఫైనల్ చేసుకున్నాడని అంటున్నారు. ‘90’s’ సిరీస్ విజయంతో ఆదిత్య హాసన్‌కు మంచి గుర్తింపు లభించడం, ఆనంద్ దేవరకొండ లాంటి యువ హీరోతో సినిమా చేయడం ఆయన కెరీర్‌కు మరింత ఊపు తెస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా 2025 డిసెంబర్‌లో షూటింగ్ పూర్తి చేసుకుని, 2026 సమ్మర్‌లో విడుదల కానుందని సమాచారం.

రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus