టాలీవుడ్‌లో ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులు హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాతలు, పెద్ద నిర్మాణ సంస్థల నివాసాలు, ఆఫీసులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల సంక్రాంతి బరిలో వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) సినిమాతో పాటు “గేమ్ ఛేంజర్” (Game Changer) లాంటి భారీ బడ్జెట్ సినిమాల తర్వాత ఆయనపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. బుధవారం దిల్ రాజు ఇంట్లో జరుగుతున్న సోదాల సందర్భంగా, ఆయన బాల్కనీలో నుంచి మీడియాను చూస్తూ ఒక సమాధానం అయితే ఇచ్చారు,
సోదాలు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది?’ అని ప్రశ్నించగా.. మన చేతుల్లో ఏముంది? వాళ్లు చెప్పినప్పుడు సోదాలు పూర్తవుతాయి. ఇంతవరకు అన్ని నిబంధనలకు లోబడే మా లావాదేవీలు జరిగాయి.. అని ఓ వివరణ ఇచ్చారు. కేవలం తనపైనే కాకుండా, పరిశ్రమ మొత్తంలో సోదాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. దిల్ రాజు మాత్రమే కాకుండా, ఆయన సోదరుడు శిరీష్(Shirish), కూతురు హన్సితా రెడ్డి నివాసాలు, అలాగే వ్యాపార భాగస్వామి మ్యాంగో మీడియా రామ్ ఆఫీసులపై కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ సోదాలు రెండో రోజుకీ సాగాయి. ప్రధానంగా సినిమా నిర్మాణానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? లావాదేవీలు పన్ను చట్టాలకు లోబడి ఉన్నాయా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కూడా ఐటి లిస్ట్ లో ఉన్నాయి. మొత్తం 55 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం.
ప్రొడక్షన్ హౌస్‌ల లావాదేవీల డాక్యుమెంట్లు, బ్యాంకు లాకర్లు, ఆర్థిక లెక్కలు అన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వసూళ్ల లెక్కలు, ట్యాక్స్ చెల్లింపుల మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక త్వరలోనే ఐటీ సోదాలపై దిల్ రాజు, ఇతర నిర్మాణ సంస్థల నుంచి మరింత స్పష్టత వెలువడనుంది.
“ఐటీ దాడులు ఒక్క నా ఇంటిపైనే కాదు.. ఇండస్ట్రీలో అందరి మీద జరుగుతున్నాయి” – దిల్ రాజు #dillraju #gamechanger #DilRaju #ITRaids #ITRaid #DirectorSukumar #Pushpa2TheRule #ravishankar #naveenyerneni pic.twitter.com/D1wa0LKmtN
— The Politician (@ThePolitician__) January 22, 2025