సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ సినిమా షూటింగులను బంద్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి చర్చిస్తున్నారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తాము తీసుకున్న కొత్త నిర్ణయాలను వెల్లడించడానికి ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 1 నుంచి షూటింగులు ఆపేసి మరీ కమిటీలు వేసుకున్నామని.. నిర్మాతలుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఎనిమిది వారాల తరువాత సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. ఆల్రెడీ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సినిమాలకు ఈ రూల్ వర్తించదని అన్నారు.
కొత్తగా అగ్రిమెంట్ చేసుకునే సినిమాలు కచ్చితంగా ఈ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని చెప్పారు. అలానే టికెట్ రేట్లు కూడా తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయంపై థియేటర్ యాజమాన్యాలు, మల్టీప్లెక్స్ లతో మాట్లాడామని చెప్పారు. సినీ ప్రియులకు టికెట్ రేట్లు తగ్గించి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇక సినిమాలో ఎందుకు వృథా ఖర్చు అవుతుందని చర్చించామని.. ఇంకా షూటింగ్స్ ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మరో మూడు, నాలుగు రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయని.. ఆ తరువాత అన్నీ వివరంగా చెబుతామని చెప్పారు. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజుతో పాటు సి.కళ్యాణ్, మైత్రి రవి, దామోదర ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.